UPPSC: అభ్యర్థుల నిరసనలతో వెనక్కి తగ్గిన యూపీ సర్కార్.. ఆ పరీక్షలు వాయిదా..
ABN , Publish Date - Nov 14 , 2024 | 09:42 PM
పీసీఎస్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉండగా.. రివ్యూ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఆర్‌ఓ-ఏఆర్‌ఓ) ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 22, 23 తేదీల్లో మూడు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.
ఉత్తర్ ప్రదేశ్: అభ్యర్థుల ఆందోళనతో ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గింది. నాలుగు రోజులుగా వేల మంది అభ్యర్థులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న నేపథ్యంలో యోగి సర్కార్ మెట్టు దిగొచ్చింది. రోజుల వ్యవధిలో షిఫ్ట్‌లు వారీగా పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు యూపీపీఎస్సీ కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ ప్రకటించారు. ఒకే రోజులో ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ (PCS) ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తామని, అలాగే ఆర్‌ఓ-ఏఆర్‌వో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు భారీ నిరసనలు చేపట్టిన రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పీసీఎస్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉండగా.. రివ్యూ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఆర్‌ఓ-ఏఆర్‌ఓ) ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 22, 23 తేదీల్లో మూడు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది. అయితే ఇలా షిఫ్టులుగా పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విధానం తీసివేసి ఒకే రోజు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు భారీ కేడ్లు తొలగించుకుని మరీ యూపీపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కొంత మంది అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పీసీఎస్ పరీక్ష విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో పీసీఎస్ పరీక్షను రెండ్రోజులు రెండు షిప్ట్‌లలో కాకుండా ఒకే రోజు రెండు షిఫ్టులలో నిర్వహించేందుకు అంగీకరించింది. అలాగే ఆర్‌వో-ఏఆర్‌వో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు చెప్పింది.
అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా పోటీ పరీక్షల విషయంలో అనేక పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి వచ్చాయని యూపీపీఎస్సీ సెక్రటరీ కుమార్ తెలిపారు. వీటిలో కొన్ని సంస్థలు ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఐదు లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలను బహుళ షిఫ్టుల్లో నిర్వహించాలని యోచించిందని కుమార్ తెలియజేశారు. విద్యార్థుల ఆందోళనలతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు కుమార్ తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో సివిల్ సర్వీస్ పరీక్షలకు యోగి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆ పరీక్షలను మార్చిలో నిర్వహించాల్సి ఉంది. అయితే పేపర్ లీకేజీ సహా పలు కారణాల వల్ల వాటిని అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ చేశారు. అలాగే ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ప్రొవెన్షియల్ సివిల్ సర్వీసెస్, రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్వ్యూ ఆఫీసర్ పరీక్షల్ని సైతం వాయిదా వేశారు. అభ్యర్థుల నిరసనలతో ప్రొవెన్షియల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఒకే రోజు నిర్వహిస్తామని చెప్పగా.. ఆర్‌వో-ఏఆర్‌వో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Viral Video: పిల్లల కోసం సింహంతో ఫైట్‌కు దిగిన చిరుత.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Car Accident: సెల్ ఫోన్ చూస్తూ రోడ్డు దాటే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..