Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
ABN , Publish Date - Sep 08 , 2024 | 02:22 PM
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి.
కోల్‌కతా, సెప్టెంబర్ 08: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. అలాంటి వేళ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత జవహర్ సిర్కార్.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో ఆందోళనలను అరికట్టడంలో పార్టీ ఘోర వైఫల్యం చెందిందన్నారు. పార్టీలో చోటు చేసుకున్న అవినీతిపై సీఎం మమతా బెనర్జీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. సీఎం మమతా బెనర్జీతో భేటీ అయి మాట్లాడేందుకు తనకు గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా.. అవకాశమే ఇవ్వడం లేదని జవహర్ సిర్కార్ పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన పలువురు ఉన్నతాధికారులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. వైద్యురాలిపై హత్యాచారం అనంతరం రాష్ట్రంలో జరిగిన ఆందోళనలతో.. ఈ ప్రభుత్వ వెనుక ప్రజలు లేరనే విషయం స్పష్టమైందని చెప్పారు. ఈ హత్యాచార ఘటన కారణంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారని.. ఈ నేపథ్యంలో గతంలో వలే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకుంటారని తాను భావించానన్నారు. అందుకోసం ఈ ఘటన జరిగిన నాటి నుంచి తాను వేచి చూసినట్లు తెలిపారు.
కానీ అలాంటి చర్యలు ఏమీ ఆమె తీసుకోలేదన్నారు. అంతేకాదు.. ఈ హత్యాచార ఘటన అనంతరం మమతా బెనర్జీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయని విమర్శించారు. అలాగే పార్టీలో, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చక్కదిద్దాలని ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ఆయన సూచించారు. అలా కాకుంటే.. రాష్ట్రం మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్లి పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాను ఎంపీగా ఉన్న ఈ మూడేళ్లలో... పెద్దల సభలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తిన విషయాన్ని ఈ సందర్బంగా జవహర్ సిర్కార్ గుర్తు చేశారు. తన పోరాటమంతా అవినీతితోపాటు మతతత్వంపైనేనని ఈ సందర్భంగా జవహర్ స్పష్టం చేశారు. మరోవైపు ఆర్ జీ కర్ కాలేజీ వైద్యురాలు హత్యాచారం ఘటన నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించిన తీరుతో పాటు.. ఆ పార్టీ నేతలపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఈ ఘటనపై స్పందించిన శంతన్ సేన్‌పై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే ఈ హత్యాచార ఘటనలో పార్టీ ప్రముఖ నేత సుఖేంద్ శేఖర్ రేను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read More National News and Latest Telugu News Click Here