Share News

Uddhav Thackeray : సీఎం అభ్యర్థి ఎవరైనా ఓకే!

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:56 AM

త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన(యూబీటీ) పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.

Uddhav Thackeray : సీఎం అభ్యర్థి ఎవరైనా ఓకే!

  • కాంగ్రెస్‌, ఎన్సీపీలు ఎవరిని ఎంపిక చేసినా మద్దతు: ఉద్దవ్‌

  • మహారాష్ట్ర రక్షణే లక్ష్యమని వెల్లడి

ముంబై, అక్టోబరు 8: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన(యూబీటీ) పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. మహావికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కూటమి పార్టీలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ(ఎస్పీ)లు సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తమకు అభ్యంతరం లేదని, వారికి మద్దతిస్తామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మహారాష్ట్ర పరిరక్షణే తమ లక్ష్యమని, దీనికి సంబంధించి కూటమి పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామన్నారు. హరియాణాలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు దెబ్బతగిలి, బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఉద్దవ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహాయూతి ప్రభుత్వం తప్పుడు ప్రకటనల ద్వారా నకిలీ ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘లడ్కి బహిన్‌’ పథకం కింద వెనుకబడిన వర్గాల్లోని మహిళలకు నెలకు రూ.1,500లు ఇస్తూ గొప్పలు చెబుతోందని, కానీ, వాస్తవానికి ప్రజల సొమ్మును ప్రజలకు ఇస్తూ.. వింత ప్రచారాలతో వారికి ద్రోహం చేస్తోందని దుయ్యబట్టారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్న మహాయూతి ప్రభుత్వం.. అమలులోకి వచ్చేసరికి మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. ‘‘నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నా.. కాంగ్రెస్‌, ఎన్సీపీ(ఎస్పీ)లు వేర్వేరుగా అయినా.. సంయుక్తంగా అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించవచ్చు. వారు ఎవరిని ప్రకటించినా నా మద్దతు ఉంటుంది. ఎందుకంటే.. మహారాష్ట్ర అంటే నాకు ఇష్టం. ఈ రాష్ట్ర పరిరక్షణే నాకు ముఖ్యం. రాష్ర్టాన్ని కాపాడేందుకు ఏదైనా చేయాలన్నదే నా అభిమతం’’ అని ఉద్దవ్‌ పేర్కొన్నారు. గుజరాత్‌కు-దేశంలోని ఇతర రాష్ట్రాలకు మధ్య అడ్డుగోడ నిర్మిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. గుజరాతీ-మరాఠీ అనే భాషా వివాదాలు మహారాష్ట్రలో లేవని తేల్చిచెప్పారు. తమ పార్టీ ఎవరినీ శత్రువులుగా చూడబోదని, అయితే, దేశ వ్యతిరేకులు, మహారాష్ట్ర వ్యతిరేకులపై మాత్రం తమ యుద్ధం కొనసాగుతుందన్నారు.

  • తేల్చాల్సింది ఆ పార్టీలే

కాగా, గత ఆగస్టులోనే ఉద్దవ్‌ తన మనసులో మాటను చెప్పేశారు. ఎన్నికల ఫలితం వచ్చాక కాదు, ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని, ఎవరిని ఎంపిక చేసినా తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఉద్దవ్‌ వ్యాఖ్యలకు శివసేన(యూబీటీ) కీలక నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ మద్దతు పలికారు. ఆయన చాలా దూరదృష్టితో ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్‌, ఎన్సీపీ(ఎస్పీ)లు మాత్రం ఎన్నికల ఫలితం వచ్చే వరకు ఈ విషయంపై స్పందించబోమని స్పష్టం చేశాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలే తేల్చాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 09 , 2024 | 05:56 AM