Share News

Kishan Reddy : బొగ్గు, గనులతో దేశానికి ఆదాయం

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:38 AM

బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు. మోదీ నాయకత్వంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు.

Kishan Reddy : బొగ్గు, గనులతో  దేశానికి ఆదాయం

  • మిషన్‌-100 డేస్‌ అజెండాతో ముందుకెళ్తా

  • సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తా: కిషన్‌రెడ్డి

  • పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల మార్పు ఉంటుందన్న కేంద్రమంత్రి

న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు.

మోదీ నాయకత్వంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రైవేటు రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయని, వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు.

‘‘విద్యుదుత్పత్తి, స్టీల్‌ కంపెనీలకు బొగ్గు అవసరం ఎక్కువగా ఉంటుంది. గనులు ఎక్కువగా రాష్ట్రాల అధీనంలో ఉంటాయి. ఇసుకతోపాటు చాలా వరకు ఖనిజాల వెలికితీతపై గనులశాఖ పర్యవేక్షణ ఉంటుంది’’ అని ఆయన వివరించారు. ఒకట్రెండు రోజుల్లో అధికారులతో సమీక్షించిన తర్వాత.. ‘మిషన్‌ 100 డేస్‌ ఎజెండా’తో ముందుకెళ్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని పెంచే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు.

‘‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. బొగ్గు ఉత్పత్తి పెరిగింది. దాంతో దేశంలో విద్యుత్తు కోతల్లేవు. పారదర్శక విధానాల రూపకల్పనతో బొగ్గు తవ్వకం, సరఫరా, వినియోగంలో అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. దేశంలో విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


  • చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరవుతానని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్‌లో సముచిత స్థానం లభించిందని అభిప్రాయపడ్డారు. తామంతా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ‘‘రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయాన శాఖ ఇవ్వడం వల్ల హైదరాబాద్‌, విశాఖ, పుట్టపర్తి తదితర విమానాశ్రయాల అభివృద్ధికి బాటలు పడతాయని విశ్వసిస్తున్నా. వరంగల్‌లో విమానాశ్రయానికి నా వంతు కృషి చేస్తా’’ అని వ్యాఖ్యానించారు.

  • రాష్ట్రాల అధ్యక్షుల మార్పు

తెలంగాణతోపాటు.. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు త్వరలో ఉంటుందని కిషన్‌రెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. సోమవారం ఉదయం ఆయన పలు మీడియా చానళ్లతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘‘బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ అధ్యక్షుల మార్పు ఉంటుంది. జాతీయ స్థాయిలోనూ కొత్త అధ్యక్షుడు వస్తాడు’’ అని వివరించారు.

Updated Date - Jun 11 , 2024 | 04:38 AM