Share News

Komatireddy Venkat Reddy : ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ టెండర్లు రద్దు

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:56 AM

గత కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Komatireddy Venkat Reddy : ఉప్పల్‌ ఫ్లైఓవర్‌  టెండర్లు రద్దు

  • కేంద్ర మంత్రి గడ్కరీ అధికారులకు ఆదేశాలిచ్చారు

  • మళ్లీ టెండర్లను పిలవాలని చెప్పారు

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): గత కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా నత్త నడకన సాగుతున్న ఉప్పల్‌- ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో నితిన్‌ గడ్కరీతో ఆయన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి సోమవారం సమావేశమయ్యారు.


హైదరాబాద్‌-విజయవాడ నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా మార్చేందుకు విస్తరణ పనులు చేపట్టాలని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. గడ్కరీతో భేటీలో మాట్లాడిన అంశాలను వెల్లడించారు. ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించి మంత్రి గడ్కరీ సదరు కాంట్రాక్ట్‌ సంస్థను తొలగించి కొత్తగా టెండర్లు పిలిచి పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.


రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడ్కరీ చెప్పారన్నారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో పాటు రహదారుల సంఖ్యను భారతమాల కింద మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్‌ స్పాట్లు గుర్తించి వాటి మరమ్మతుల కోసం కేంద్రం 375 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు.

డిసెంబర్‌లోపు తాత్కాలిక పనులు పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 03:56 AM