Monsoon: రుతుపవనాలు అంటే ఏంటి? ఎలా ఏర్పడుతాయి? తొలి వర్షం ఎక్కడ కురుస్తుంది?
ABN , Publish Date - May 30 , 2024 | 02:24 PM
Monsoon Updates: రుతుపవనాలు(Monsoon) కాలానుగుణంగా ఏర్పడుతాయి. మన దేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి రుతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు. బలమైన గాలుల దిశలో కాలానుగుణంగా ఏర్పడే మార్పే రుతుపవనాలు.
Monsoon Updates: రుతుపవనాలు(Monsoon) కాలానుగుణంగా ఏర్పడుతాయి. మన దేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి రుతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు. బలమైన గాలుల దిశలో కాలానుగుణంగా ఏర్పడే మార్పే రుతుపవనాలు. భూమిపై గాలి వేడెక్కి వాతావరణంలో కలుస్తుంది. ఆ గాలి సముద్రం వైపు వీస్తుంది. అదే సమయంలో సముద్రంలోని నీరు కూడా ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ కారణంగా గాలిలో తేమ శాతం పెరిగి.. బరువుగా మారుతుంది.
దీంతో గాలి వీచే దిశ మారుతుంది. తేమగా ఉన్న ప్రాంతం నుంచి ఉష్ణ ప్రాంతంవైపు ఆ గాలి మల్లుతుంది. అంటే సముద్రం నుంచి భూమిపైకి గాలులు వీస్తాయి. తద్వారా తేమతో కూడిన గాలి కాస్తా ఘనీభవించి వర్షంగా కురుస్తుంది. నైరుతి నుంచి భారతదేశం వైపు ఈ గాలులు వీస్తాయి. ఈ కారణంగానే నైరుతి రుతుపవనాలు అంటారు. ఈ సీజన్‌నే మాన్‌సూన్ అని కూడా అంటాం. వాస్తవానికి మాన్‌సూన్ అనే పదం అరబిక్ పదం మౌసిమ్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ‘సీజన్’.
మాన్‌సూన్‌ని మనం సాధారణ పదాలలో అర్థం చేసుకుంటే, దాని అర్థం వాతావరణం. రుతుపవనాలు దక్షిణాసియా వాతావరణాన్ని ప్రభావితం చేసే అతి పెద్ద అంశం. భారతదేశంలో పంటల ఉత్పత్తి, భూగర్భ జలాల లభ్యత నేరుగా రుతుపవనాలతో ముడిపడి ఉన్నాయి. సరళంగా చెప్పాలంటే.. వేసవి కాలం తర్వాత దిశను మార్చే పవనాలను రుతుపవనాలు అంటారు. ఈ సమయంలో, ఈ గాలులు తమ దిశను మార్చుకుంటాయి. చల్లని ప్రాంతం నుంచి.. వేడి ప్రాంతాల వైపు వీస్తాయి. అవి చల్లని ప్రాంతాల నుండి వేడి ప్రాంతాలకు ప్రవహిస్తాయి కాబట్టి.. ఈ గాలులలో తేమ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో కేరళ తీరాన్ని తాకిన వెంటనే వర్షాలు పడడానికి కారణం ఇదే.
తొలి వర్షం ఎక్కడ కురుస్తుంది..
నైరుతి రుతు పవనాలు మే 30న అంటే గురువారం మధ్యాహ్నం కేరళ రాష్ట్రాన్ని తాకాయి. అయితే, రుతుపవనాల కారణంగా మన దేశంలో తొలుత వర్షం పడే ప్రాంతం ఏదో తెలుసా? కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో తొలి వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలోనే మొదట వర్షాలు కురుస్తాయి. ఆ తరువాత దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయి. జూన్ 1 నుంచి 10 తేదీల మధ్య రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 15 నాటికి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో, జూన్ 20, 25 మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉంది. జూన్ 30 నాటికి ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే, ఈ సారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.