Lok Sabha Elections: బహరామ్‌పూర్‌లో దిగ్గజాల 'ఢీ'
ABN , Publish Date - Mar 10 , 2024 | 05:17 PM
'ఇండియా' కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మరో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు 'సోలో'గా అభ్యర్థులను ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య 'మిత్రభేదం' తప్పేలా లేదు. బెంగాల్‌లోని బహరామ్‌పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను టీఎంసీ రంగంలోకి దింపింది.
కోల్‌కతా: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ (Congress) పార్టీకి ఝలక్ ఇచ్చి పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు 'సోలో'గా అభ్యర్థులను ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య 'మిత్రభేదం' తప్పేలా లేదు. బెంగాల్‌లోని బహరామ్‌పూర్ (Baharampur)కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury)పై టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan)ను టీఎంసీ రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనప్పటికీ బహరామ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన అధీర్ రంజన్ ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి.
టీఎంసీ ఏకపక్షంగా తమ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించడంతో బెంగాల్‌లో బీజేపీయేతర ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని స్పష్టం చేసినట్టు అయింది. టీఎంసీ-కాంగ్రెస్ మధ్య పొత్తులకు జరిగిన సంప్రదింపుల్లో బహరామ్‌పూర్ నియోజకవర్గంతో పాటు, మరో సీటును కాంగ్రెస్‌కు టీఎంసీ ఆఫర్ చేసింది. అయితే తమకు గౌరవప్రదమైన రీతిలో తగిన స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ కోరడంతో టీఎంసీ 'సోలో'గానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగినట్టుగా అధికార టీఎంసీని తరచు తూర్పారబట్టే అధీర్ రంజన్‌పై పఠాన్ వంటి పాపులర్ వ్యక్తిని రంగంలోకి దించింది. పొత్తులపై మీనమేషాలు లెక్కిస్తున్న టీఎంసీపై చౌదరి ఇటీవల ఘాటు విమర్శలు చేశారు. సీట్లు అడుక్కునే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని, విపక్ష కూటమిని పటిష్టం చేసే బదులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ తహతహలాడుతోందని విమర్శించారు. దీనిపై టీఎంసీ మరింత ఘాటుగా స్పందించింది. ఒకవైపు భాగస్వామ్య పార్టీలపై నోరుపారేసుకుంటూ, మరోవైపు సీట్ల షేరింగ్ అంటే ఎలా కుదురుతుందని నిలదీసింది.