Health Secrets : ముద్ద... మింగుడు పడకపోతే?
ABN , Publish Date - Aug 27 , 2024 | 03:45 AM
తిన్నది గొంతులోనే ఉండిపోయినట్టు అనిపిస్తూ, ఛాతీ మంట కూడా వేధిస్తుంటే ఎవరైనా దాన్ని అజీర్తి సమస్యగానే భ్రమపడతారు. దాంతో జీర్ణకోశ వైద్యులను సంప్రతించి మందులు వాడుకోవడం మొదలు పెడతారు.
అకలేసియా కార్డియా
కొన్ని ఆరోగ్య లక్షణాలు తప్పుదోవ పట్టిస్తాయి. మరొక సమస్యగా భ్రమపడేలా చేసి, వ్యాధి నిర్థారణను ఆలస్యం చేస్తాయి. అలాంటి కోవకు చెందిన అన్నవాహిక సమస్యే ‘అకలేసియా కార్డియా’! సకాలంలో గుర్తిస్తే, శులభమైన చికిత్సతో అదుపులోకొచ్చే ఈ సమస్య గురించి వైద్యులు ఏమంటున్నారంటే...
తిన్నది గొంతులోనే ఉండిపోయినట్టు అనిపిస్తూ, ఛాతీ మంట కూడా వేధిస్తుంటే ఎవరైనా దాన్ని అజీర్తి సమస్యగానే భ్రమపడతారు. దాంతో జీర్ణకోశ వైద్యులను సంప్రతించి మందులు వాడుకోవడం మొదలు పెడతారు.
ఇంకొందరు ఛాతీలో మంటను గుండె నొప్పిగా పొరబడి గుండె వైద్యులను కూడా కలుస్తూ ఉంటారు. నిజానికి ఈ లక్షణాలతో పాటు మింగడంలో కూడా ఇబ్బంది ఉంటే, దాన్ని ‘అకలేసియా కార్డియా’గా భావించాలి. సాధారణంగా మనం ఏం తిన్నా, తాగినా సెకన్ల వ్యవధిలో పొట్టలోకి చేరిపోతుంది.
అన్నవాహికలోని కండరాలు కదులుతూ తిన్న పదార్థాన్ని పొట్టలోకి జారుస్తూ ఉంటాయి కాబట్టి ఏం తిన్నా, తాగినా అవన్నీ క్షణాల వ్యవధిలో పొట్టలోకి చేరిపోతూ ఉంటాయి.
కానీ కొందర్లో అన్నవాహికలోని కండరాల కదలికల్లో లోపం ఉంటుంది. జీర్ణాశయానికి దగ్గర్లో ఉండే లోయర్ ఈసోఫీగల్ స్ఫింక్టర్ బిగుతుగా మారిపోవడం వల్ల, తిన్న ఘన, ద్రవపదార్థాలన్నీ అన్నవాహికలోనే ఎక్కువ సమయం పాటు ఉండిపోయి, నెమ్మదిగా కిందకు జారుతూ ఉంటాయి. దాంతో ఛాతీలో మంట, అసౌకర్యం వేధిస్తాయి.
ఇదే పరిస్థితి ఎక్కువ కాలం పాటు కొనసాగితే ట్యూబులా ఉండవలసిన అన్నవాహిక బెలూన్‌లా ఉబ్బిపోతుంది. ఆహారం గొంతులో నుంచి పైకి ఎగదన్నడంతో ఈ సమస్యను గ్యాస్ట్రోఈసోఫీగల్ రిఫ్లక్స్ (జిఇఆర్‌డి)గా భ్రమపడతారు. నిజానికి జిఇఆర్‌డి సమస్యలో పొట్టలో నుంచి ఆహారం గొంతులోకి ఎగదన్నుతుంది. కానీ అకలేసియా కార్డియాలో అన్నవాహికలోని ఆహారమే గొంతులో నుంచి పైకి ఎగదన్నుతూ ఉంటుంది.
ఈ లక్షణాలు కీలకం
ప్రోగ్రెసివ్ డిస్ఫాజియా: ఘన, ద్రవ పదార్థాలు రెండింటినీ మింగడంలో ఇబ్బంది
జీర్ణం కాని ఆహారం నోట్లోకి చేరుకోవడం:
పొట్టలోకి ఆహారం చేరుకోలేదు కాబట్టి, కొన్ని గంటల పాటు అన్నవాహికలో ఉండిపోయిన ఆహారమే నోట్లోకి తన్నుకొస్తుంది.
ఛాతీ నొప్పి: ఛాతీలో నొప్పి, పట్టేసినట్టు ఉండడం
బరువు తగ్గడం: తినడంలో ఇబ్బంది ఉండడం వల్ల పోషకాహార లోపంతో బరువు తగ్గుతారు
ఎందుకీ సమస్య
సాధారణంగా మనం ఆహారం తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు, అన్నవాహిక దిగువన, జీర్ణకోశం మొదలులో ఉండే లోయర్ ఈసోఫీగల్ స్ఫింక్టర్ కండరాల సహాయంతో సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ తిన్న పదార్థాలను పొట్టలోకి పంపిస్తూ ఉంటుంది. కొందర్లో మెదడు నుంచి ఈ కండరాల కదలికలకు సంకేతాలు అందవు.
ఈ నాడీ సమస్య వల్ల స్ఫింక్టర్ రిలాక్స్ అవకుండా బిగుతుగా ఉండిపోవడం వల్ల ఆహారం పొట్టలోకి చేరుకోలేక అన్నవాహికలోనే ఉండిపోతూ ఉంటుంది. ఇది అరుదైన సమస్యే అయినా, సాధారణంగా 30 నుంచి 60 ఏళ్ల వయస్కుల్లో బయటపడుతూ ఉంటుంది.
ప్రారంభంలో దీన్ని అసిడిటీగా, జీర్ణ సంబంధ సమస్యగా పొరబడి రెండు, మూడేళ్ల పాటు అసలు సమస్యను గుర్తించడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. కానీ వీలైనంత త్వరగా గుర్తుపట్టగలిగితే సమస్యను సమర్థమైన చికిత్సతో అదుపులోకి తెచ్చుకోగలిగే వీలుంటుంది.
ఈ పరీక్ష కీలకం
ప్రారంభంలోనే గుర్తించగలిగితే ఎండోస్కోపీ ద్వారా పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (పిఒఈమ్) ద్వారా చురుగ్గా ఉన్న స్ఫింక్టర్ కండరాన్ని కత్తిరించి, రిలాక్స్ చేయడం జరుగుతుంది. పూర్వం ఈ సమస్యను సర్జరీతో సరిదిద్దేవారు. కానీ ప్రస్తుతం ఎండోస్కోపీ ద్వారానే సమస్యను శాశ్వతంగా సరిదిద్దడం సాధ్యపడుతోంది. సాధారణంగా ఎండోస్కోపీతోనే గొంతు, అన్నవాహిక సమస్యలన్నీ తెలిసిపోతాయి అనుకుంటారు.
కానీ ఈసోఫేజియల్ మ్యానోమెట్రీ అనే పరీక్షతో అన్నవాహికలోని కండరాల పనితీరును స్పష్టంగా, కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షతో అకలేసియా కార్డియాతో పాటు అన్నవాహిక కండరాల కదలికల సమస్యలన్నిటినీ కనిపెట్టవచ్చు.
వాళ్లలో కూడా ఇవే లక్షణాలు
కొందరు పిల్లలు ఎంతసేపు నములుతూ ఉంటారే తప్ప నోట్లో పెట్టుకున్న ముద్దను మింగలేరు. ఇది జన్యుపరమైన డెవల్‌పమెంటల్ అబ్నార్మాలిటీ. పుట్టుకతోనే అన్నవాహికలో, స్ఫింక్టర్‌లో లోపాలే ఈ లక్షణాలకు కారణం. కానీ ఈ సమస్యకూ అకలేసియా కార్డియాకు సంబంధం ఉండదు.
అలాగే కొందర్లో అన్నవాహికలో అల్సర్లు ఉండి, పదార్థాలను మింగలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అకలేసియా సమస్యను మరిపించే ఇంకొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటంటే...
ఓరోఫారింజియల్ డిస్ఫాజియా: బ్రెయిన్ స్ట్రోక్, పార్కిన్సన్స్ వ్యాధుల మూలంగా గొంతు, నోట్లో సమస్యలు తలెత్తి, మింగడానికి గొంతు సహకరించకపోవచ్చు.
ఈసోఫేజియల్ డిస్ఫాజియా: గొంతులో లేదా ఛాతీలో ఆహారం ఇరుక్కుపోయినట్టు అనిపించడం. గ్యాస్ట్రోఈసోఫీగల్ రిఫ్లక్స్ డిసీజ్, స్ట్రిక్చర్స్ లేదా మొటిలిటీ డిజార్డర్ మూలంగా ఈ సమస్య తలెత్తవచ్చు
డిస్ఫాజియా కారణాలు ఇవే!
మింగడంలో ఇబ్బందిని డిస్ఫాజియా అంటారు. అందుకు భిన్నమైన కారణాలుంటాయి. అయితే ప్రతి కారణాన్నీ అకలేసియా కార్డియాగా ముడిపెట్టకూడదు. అలా జరగకుండా ఉండాలంటే డిస్ఫాజియాకు దారితీసే ఇతరత్రా సమస్యల పట్ల కూడా అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం. అవేంటంటే...
న్యూరలాజికల్ డిజార్డర్స్: స్ట్రోక్, మల్టిపుల్ స్ల్కెరోసిస్ లేదా అమయోట్రోఫిక్ స్ల్కెరోసి్‌సల మూలంగా మింగడానికి తోడ్పడే కండరాల్లో లోపాలు ఏర్పడడం
స్ట్రక్చరల్ ప్రాబ్లెమ్స్: ట్యూమర్లు, ఈసోఫీగల్ స్ట్రిక్చర్స్ లేదా అన్నవాహికలో వంపు ఉండడం, అన్నవాహిక ఇరుకుగా ఉండడం వల్ల మింగడంలో ఇబ్బందులు ఉండవచ్చు
జిఇఆర్‌డి: గ్యాస్ట్రోఈసోఫీజియల్ రిఫ్లక్స్ డిసీజ్‌లో తీవ్రమైన యాసిడ్ రిఫ్లక్స్ వల్ల అన్నవాహిక ఇరుకుగా మారిపోయి, డిస్ఫాజియా ఏర్పడవచ్చు.
ఇతరత్రా డిస్ఫాజియా సమస్యలను మెత్తని, ద్రవరూప ఆహారంతో సరిదిద్దుకోవచ్చు. అలాగే స్వాలోవింగ్ థెరపీతో అన్నవాహిక కండరాల పనితీరును మెరుగపరచడం ద్వారా చక్కదిద్దుకోవచ్చు. కొన్ని మందులు కూడా ఉపయోగపడతాయి. పుట్టుకతోనే అన్నవాహికలో లోపాలుంటే వాటిని సర్జరీతో సరిదిద్దుకోవచ్చు.
డిస్ఫాజియా, అకలేసియా కార్డియా... అన్నవాహికకకు సంబంఽధించిన ఈ రెండు సమస్యలూ ఒకే రకమైన లక్షణాలనే కలిగి ఉన్నప్పటికీ వాటి కారణాలు, చికిత్సా వ్యూహాలు భిన్నంగా ఉంటాయి.
కాబట్టి సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగిన చికిత్సను ఎంచుకోగలిగితే పోషకాహారలోపం, ఆస్పిరేషన్ న్యుమోనియా లాంటి సమస్యలను ముందుగానే అడ్డుకోవచ్చు.
డిస్ఫాజియాతో బాధపడేవారు మూల కారణాన్ని కనిపెట్టడం కీలకమైతే, అకలేసియా కార్డియా సమస్య కలిగిన వారు, సరైన, సమర్థమైన చికిత్సా విధానంతో లోయర్ ఈసోఫీగల్ స్ర్పింక్టర్‌లో లోపాన్ని చక్కదిద్దుకోవడం అవసరం.
చికిత్స సులభమే
న్యుమాటిక్ డైలేషన్:
ఒక బెలూన్‌ను దగ్గరకు పంపించి లోయర్ ఈసోఫీగల్ స్ఫింక్టర్ వ్యాకోచింపచేయడం ద్వారా అన్నవాహికలోని ఆహారం తేలికగా పొట్టలోకి చేరుకోగలిగే వీలు కల్పించవచ్చు
పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ:
లోయర్ ఈసోఫీగల్ స్ఫింక్టర్ కండరాలను కత్తిరించి అవరోధాన్ని తొలగించవచ్చు
బోట్యులినమ్ టాక్సిన్ (బొటాక్స్):
లోయర్ ఈసోఫీగల్ స్ఫింక్టర్‌ను తాత్కాలికంగా బలహీనపరచవచ్చు. ఈ చికిత్స ఎక్కువ సార్లు అవసరంపడవచ్చు.
మందులు: క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ లేదా నైట్రేట్స్ లోయర్ ఈసోఫీగల్ స్ఫింక్టర్‌ను రిలాక్స్ చేస్తాయి. అయితే ఇవి సర్జరీతో సమానమైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు
డాక్టర్ సోమశేఖర రావు,
సీనియర్ కన్సల్టెంట్,
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్‌సిటీ,
హైదరాబాద్.