Navya : బట్టతలకు బ్రేక్!
ABN , Publish Date - Jul 09 , 2024 | 02:19 AM
తోచిన చిట్కాలు పాటిస్తూ, దొరికిన నూనెలన్నీ పూసేసినంత మాత్రాన బట్టతలకు బ్రేక్ పడదు. వెంట్రుకలు రాలుతున్నాయని గ్రహించిన వెంటనే అప్రమత్తమై వైద్యులను కలిస్తే బట్టతలను వాయిదా వేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం!
హెయిర్ కేర్
తోచిన చిట్కాలు పాటిస్తూ, దొరికిన నూనెలన్నీ పూసేసినంత మాత్రాన బట్టతలకు బ్రేక్ పడదు. వెంట్రుకలు రాలుతున్నాయని గ్రహించిన వెంటనే అప్రమత్తమై వైద్యులను కలిస్తే బట్టతలను వాయిదా వేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం!
కుటుంబంలో బట్టతల ఉంటే తర్వాతి తరానికి సంక్రమించే అవకాశాలు ఎక్కువ! అలాగని బట్టతల కోసం ఎదురు చూస్తూ, రాలిపోయే వెంట్రుకలను చూసుకుని దిగాలు పడుతూ ఉండడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? బట్టతలకు శాశ్వత పరిష్కారమనేది లేకపోయినా, వెంట్రుకలు రాలిపోకుండా చేసి, రాలిన వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలను నాటే ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఎక్కువ మంది... ‘రాలినన్ని వెంట్రుకలు రాలనిద్దాం! పూర్తిగా రాలిపోయిన తర్వాత హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుందాం’ అనే ధోరణితో ఉంటారు. కానీ వెంట్రుకలు రాలడం కనిపెట్టిన వెంటనే చికిత్స మొదలుపెడితే, మిగిలిన వెంట్రుకలు రాలిపోకుండా నియంత్రించుకోవచ్చు. కుటుంబంలో బట్టతల ఉన్నవాళ్లు మరికాస్త ముందుగా, అంటే వెంట్రుకలు రాలడం మొదలవక ముందే చికిత్స మొదలుపెడితే, బట్టతలకు అడ్డుకట్ట వేయొచ్చు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడు?
బట్టతలకు వయసుతో సంబంధం లేదు. 20 ఏళ్లకే బట్టతలతో బాధపడుతున్న వాళ్లను చూస్తున్నాం. ఆ సమస్యతో సర్దుకుపోకుండా, వెంట్రుకలు రాలడం మొదలుపెట్టగానే చికిత్స తీసుకోవాలనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ సమస్య ఏ వయసులో మొదలైనా, ఎవరైనా నిరభ్యంతరంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. 20 నుంచి 70 ఏళ్ల వయస్కులు ఈ ప్రక్రియను ఆశ్రయించవచ్చు. అయితే అంతకంటే ముందు బట్టతల ఏర్పడే దశల గురించి కొంత అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం. సాధారణంగా బట్టతలలో 8 దశలుంటాయి. 8వ దశలో 70 నుంచి 80ు వెంట్రుకలు లేని వాళ్లకు ఎక్కువ వెంట్రుకలు అవసరమవుతాయి. అన్ని వెంట్రుకలు వాళ్ల శరీరం మీద లేకపోతే, వాళ్లకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సాధ్యపడదు. అలాగే తొలి రెండు దశల్లో కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవలసిన అవసరం లేదు. కాబట్టి రెండో దశ నుంచి ఆరో దశ వరకూ ఉన్న బట్టతలలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవచ్చు.
ఇతర సమస్యలతో....
పేను కొరుకుడు, స్కారింగ్ అలొపేసియా, సోరియాసిస్ మొదలైన సమస్యలున్నవాళ్లలో ఆ సమస్యల మూలంగా తల మీద వెంట్రుకలు ఊడిపోతుంటే, దాన్ని బట్టతలగా భావించడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినా, శరీరం ఆ వెంట్రుకలను రిజెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ వెంట్రుకలు నాటుకోకుండా ఊడిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి ఆ సమస్య ఏడాదిపాటు పెరగకుండా ఉండి, అసలు సమస్యకు చికిత్స చేసుకున్నా, వెంట్రుకలు మొలవని సందర్భాల్లో మాత్రమే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆశ్రయించాలి. లేదంటే చికిత్స విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో స్కారింగ్ అలొపేషియా ఉంటుంది. చర్మానికి రక్తసరఫరా లేకపోవడంతో, ఆ ప్రదేశంలో వెంట్రుకలను నాటినా, శరీరం రిజెక్ట్ చేయొచ్చు. కాబట్టి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని, స్కాల్ప్ బయాప్సీతో సమస్యను కచ్చితంగా గుర్తించి, సమస్యను సరిదిద్దుకున్న తర్వాత మాత్రమే హెయిర్ ట్రాన్స్‌ప్లేంటేషన్‌ను ఆశ్రయించాలి.
ఫెయిల్యూర్ ఎందుకు?
నాటిన వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే, అందుకు చాలా కారణాలుంటాయి. సోరియాసిస్, అలొపేసియా లాంటి చర్మ సమస్యలతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆశ్రయించడంతో పాటు, ఆ చికిత్సలో సమర్థులైన వైద్యులను ఎంచుకోకపోవడం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ విఫలమవడానికి ప్రధాన కారణం. సాధారణంగా ఈ ప్రక్రియ కోసం తల వెనకభాగంలో, మెడ పైన ఉన్న వెంట్రుకలనూ, లేదంటే గడ్డం, ఛాతీల్లోని వెంట్రుకలను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఉపయోగిస్తారు. అయితే ఆ వెంట్రుకలను సేకరించేటప్పుడు, ఎంతో జాగ్రత్తగా వేరుతో సహా సేకరించాలి. ఆ క్రమంలో వేరు తెగిపోతే, ఆ వెంట్రుక నాటడానికి పనికి రాదు. వేరు లేని మొక్క ఎలా పెరగదో, వేరు లేని వెంట్రుక కూడా పెరగదు. బయటకు వెంట్రుక ఉన్నట్టు కనిపించినా, అది పెరగకుండా కొంత కాలానికి రాలిపోతుంది. కాబట్టి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్‌ను ఎంచుకోవాలి. చాలా మంది హెయిర్ సెలూన్లనూ, చిన్నచిన్న క్లినిక్స్‌నూ, టెక్నీషియన్లనూ ఆశ్రయిస్తూ ఉంటారు. ఇది సరి కాదు.
బట్టతల రాకుండానే...
తల పలుచగా ఉండీ, చిక్కగా కనిపించాలనుకునేవాళ్లకు కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయవచ్చు. అలాంటప్పుడు తల మీద నాటిన వెంట్రుకలతో పాటు, ముందు నుంచీ ఉన్న వెంట్రుకలు రెండూ ఉంటాయి. కానీ నాటిన వెంట్రుకలు శాశ్వతంగా ఉండిపోతే, ముందు నుంచీ ఉన్న వెంట్రుకలు కొంత కాలానికి ఊడిపోవచ్చు. అప్పుడు తల మీద వెంట్రుకలు ఎబ్బెట్టుగా కనిపించే అవకాశాలుంటాయి. కాబట్టి ముందునుంచీ ఉన్న వెంట్రుకలను కాపాడుకోవడం కోసం, ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత, కొన్ని లోషన్లను వైద్యులు సూచిస్తారు. వాటిని వాడుకుంటే వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. వీళ్లే కాకుండా బట్టతల ప్రారంభంలో వెంట్రుకలు రాలడం మొదలైన సందర్భాల్లో కూడా ఈ లోషన్‌తో వెంట్రుకలు రాలకుండా చూసుకోవచ్చు. దీంతో వెంట్రుకలు రాలే ప్రక్రియ వాయిదా పడుతుంది.
ఎన్ని వెంట్రుకలు?
ఎన్ని వెంట్రుకలను నాటాలి అనేది ఎంత ఏరియాలో ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నారు? వాళ్ల దగ్గరి నుంచి సేకరించడానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక సిటింగ్‌లోనే ట్రాన్స్‌ప్లాంట్ పూర్తయిపోతుంది. ఒకవేళ 5 నుంచి 6 వేల వెంట్రుకలు నాటవలసి వస్తే, రెండు సిట్టింగ్స్ అవసరమవుతాయి. వెంట్రుక కుదుళ్లలో ఒక వెంట్రుకే ఉంటుందనుకుంటాం. కానీ రెండు, మూడు, నాలుగు వెంట్రుకలు కూడా ఉంటూ ఉంటాయి. ఇలా ఒక గ్రాఫ్ట్ నుంచి ఎన్ని వెంట్రుకలు వస్తాయనేదాని మీద కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలున్నవాళ్లు వాటిని మందులతో అదుపులో పెట్టుకున్న తర్వాతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలి. తర్వాత నుంచి అందర్లాగే వ్యవహరించవచ్చు. తలస్నానం చేయొచ్చు. ఊడిపోతాయేమోననే భయం అవసరం లేదు. కొందరికి ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత పిఆర్‌పి అవసరం పడుతుంది. ఈ విషయాన్ని వైద్యులే సూచిస్తారు. అలాంటివాళ్లు వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి.
పిఆర్‌పి ఫలితం ఏ మేరకు?
ఐదారు నెలల క్రితం పోగొట్టుకున్న వెంట్రుకలు పెరగడానికి పిఆర్‌పి తోడ్పడుతుంది. కానీ ఎన్నో ఏళ్ల ముందు వెంట్రుకలు ఊడిపోయి, తల నున్నగా మారిపోయిన సందర్భాల్లో పిఆర్‌పి, డెర్మా రోలర్. ఇంజెక్షన్స్ లాంటి చికిత్సలు ఫలితాన్నివ్వవు. ఇలాంటి కేసుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక్కటే ఉత్తమమైన పరిష్కారం.
డాక్టర్ స్వప్న ప్రియ, డెర్మటాలజిస్ట్,
కాస్మోస్యూర్ క్లినిక్, హైటెక్ సిటీ, హైదరాబాద్.