Share News

AP Politics: ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఏం చేయబోతున్నారు.. అందరి చూపు ఇటే..!

ABN , Publish Date - Mar 07 , 2024 | 03:35 PM

AP Election 2024: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ వేదికగా బాబు ఏం చేయబోతున్నారు..? ఎవరెవరితో భేటీ కాబోతున్నారు..? ఈ పర్యటనతో బీజేపీతో (BJP) పొత్తుపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందా..? లేదా..? ఇప్పుడిదే గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకూ ఇదే చర్చ...

AP Politics: ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఏం చేయబోతున్నారు.. అందరి చూపు ఇటే..!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ వేదికగా బాబు ఏం చేయబోతున్నారు..? ఎవరెవరితో భేటీ కాబోతున్నారు..? ఈ పర్యటనతో బీజేపీతో (BJP) పొత్తుపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందా..? లేదా..? ఇప్పుడిదే గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకూ ఇదే చర్చ. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇవాళ రాత్రికి బీజేపీ అగ్రనేతలతో బాబు కీలక చర్చలు జరపబోతున్నారు. రాత్రికి ఢిల్లీలోనే ఆయన బస చేయబోతున్నారు. మరోవైపు.. రాత్రి 8 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. 9 గంటల తర్వాత బీజేపీ పెద్దలు.. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కలిసి భేటీ కాబోతున్నారు. ఈ భేటీతో ఏపీలో పొత్తులు.. సీట్ల పంపకాలపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇవాళ చర్చలు కొలిక్కిరాని పక్షంలో శుక్రవారం సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల చర్చ అనంతరం నడ్డాతో కలిసి చంద్రబాబు, పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


Chandrababu-Delhi.jpg

టీడీపీ ఇస్తామన్నదేంటి..?

పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు లభిస్తాయన్నదానిపై సర్వత్రా ఆసక్తిగా ఉంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక శాతంలోపే ఓట్లు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బలానికి మించి సీట్లు ఇస్తే.. తర్వాత గెలవలేకపోతే వైసీపీ లాభపడుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీట్లు ఇవ్వగా.. ఆ పార్టీ 4 చోట్లే గెలిచింది. ఈసారి విజయావకాశాలున్న అభ్యర్థులు ఉన్నచోటే బీజేపీకి సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అయితే.. బీజేపీ మాత్రం 5 ఎంపీ, 13 అసెంబ్లీ సీట్లు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీడీపీ సర్వే కూడా చేయించింది. ఆ ఫలితాలు కొందరికి అనుకూలం, ఇంకొందరికి ప్రతికూలంగా వచ్చాయి. 3 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లు బీజేపీకివ్వాలని కొందరు టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుకు ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది.

Chandrababu-And-Pawan.jpg

బీజేపీకి కావాల్సిందేంటి..?

బీజేపీ ప్రతిపాదించిన లోక్‌సభ స్థానాల్లో నరసాపురం, తిరుపతి(ఎస్సీ), అరకు(ఎస్టీ) ఉన్నాయి. అయితే బీజేపీ నేతలు 3 లోక్‌సభ సీట్లు.. నరసాపురం, రాజమహేంద్రవరం, ఏలూరు, రాజంపేట, తిరుపతి కోరుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో 5 ఎంపీ సీట్లుంటే వాటిలో 4 పొత్తులో బీజేపీకి, జనసేన(కాకినాడ)కు వెళ్తాయని, తమకు ఒకటి(అమలాపురం) మాత్రమే దక్కుతుందని.. ఇది తమకు అంగీకారం కాదని టీడీపీ నాయకుడొకరు అన్నారు. రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో ముస్లింల సంఖ్యాబలం అధికమని.. అక్కడ బీజేపీకి విజయావకాశాలు తక్కువని.. పైగా తమ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఇబ్బంది అని సీమ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగే బీజేపీకి 5 అసెంబ్లీ సీట్లు ఇవ్వొచ్చని వినవస్తోంది. అయితే ఆ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నట్లు తెలిసింది. ఆయా సీట్లు ఆశిస్తున్న బీజేపీ నేతలు పొత్తు దిశగా తమ అధినాయకత్వం వద్ద గట్టి లాబీయింగ్‌ చేస్తున్నారు. తమ వాదనకు అనుకూలంగా కొన్ని నివేదికలు సమర్పించారు. ఇక సీట్ల సర్దుబాటు ఖరారయ్యాక ఢిల్లీ పెద్దలు ఎన్టీయేలో టీడీపీ చేరికను లాంఛనంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

Nadda-And-Amit-Shah.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 03:35 PM