Malkajgiri: అందరి చూపు.. అటు వైపే.. తెరపైకి హేమాహేమీల పేర్లు..!
ABN , Publish Date - Feb 18 , 2024 | 03:44 PM
దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచిన నగరంలోని మల్కాజిగిరి స్థానంపై అన్ని పార్టీల చూపు పడింది.
మల్కాజిగిరి సీటుపై అన్ని పార్టీల గురి
టికెట్ కోసం పదుల సంఖ్యలో ప్రయత్నాలు
పట్టు నిలుపుకునేలా కాంగ్రెస్ కసరత్తు
తమదే గెలుపంటున్న బీఆర్‌ఎస్, బీజేపీ
మూడు పార్టీల నుంచి టికెట్‌కు తీవ్రపోటీ
ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రజల్లోకి..
అధిష్ఠానాల చుట్టూ తిరుగుతున్న ఆశావహులు
అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ వే‘ఢీ‘
మల్కాజిగిరి, ఫిబ్రవరి 18: (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచిన నగరంలోని మల్కాజిగిరి స్థానంపై అన్ని పార్టీల చూపు పడింది. ఇప్పటివరకు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధించేలా ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అలాగే ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు సైతం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి పోటీకి హేమాహేమీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సెంగ్మెంట్‌లోని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం.. గులాబీ పార్టీకి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే కేంద్రంలో మరోసారి బీజేపీదే ప్రభుత్వమంటూ కాషాయం నేతలు సైతం ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా అన్ని పార్టీలకు చెందిన ఆశావహులు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో వాల్‌పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తాము పోటీకి సిద్ధమంటూ తమ పార్టీల అధిష్ఠానాలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అవకాశం ఇస్తే పోటీ చేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎ్‌సకు చెందిన ఆశావహులు పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.
బీజేపీ నుంచి హేమాహేమీలు..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫున మల్కాజిగిరి సీటును దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి సీనియర్ నేత ఈటల రాజేందర్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మురళీధర్ రావు, కూన శ్రీశైలంగౌడ్, సురానా ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌సురానా, కృష్ణధర్మ పరిషత్ జాతీయ కార్యదర్శి, బీజేవైఎం స్టేట్ స్పోర్ట్స్ కన్వీనర్ జి.రాముయాదవ్, విద్యావేత్త పల్లవి మోడల్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య తదితరులు ఈ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పత్రికా ప్రకటనలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టితోపాటు అధిష్ఠానం దృష్టిలో పడేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి మల్లారెడ్డి తనయుడు!
కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతోపాటు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తరపున మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి