Share News

AP Elections: తీవ్ర అసంతృప్తిలో ఆలపాటి.. టీడీపీని వీడటానికి సన్నాహాలు!

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:45 PM

Alapati Rajendra Prasad: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమిని కాసింత అసంతృప్తి కూడా వెంటాడుతోంది. టికెట్లు దక్కని సీనియర్లు, మాజీ మంత్రులు, సిట్టింగులు.. కీలక నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలను వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు..

AP Elections: తీవ్ర అసంతృప్తిలో ఆలపాటి.. టీడీపీని వీడటానికి సన్నాహాలు!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమిని కాసింత అసంతృప్తి కూడా వెంటాడుతోంది. టికెట్లు దక్కని సీనియర్లు, మాజీ మంత్రులు, సిట్టింగులు.. కీలక నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలను వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అటు వైసీపీ నుంచి సిట్టింగులు.. టీడీపీలోకి (TDP) రావడంతో పరిస్థితులు అనుకూలించక సర్వేలు, నియోజకవర్గంలోని పరిస్థితుల రీత్యా తప్పక టికెట్ ఇవ్వాల్సి వస్తోంది. ఇక కూటమిలో భాగంగా జనసేన, బీజేపీకి కొన్ని సీట్లను టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో టికెట్లు దక్కని తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే టీడీపీని వీడటానికి కూడా ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఉమ్మడి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది.


Alapati-rajendra-prasad.jpg

అసలేం జరిగింది..?

గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గమైన తెనాలి స్థానాన్ని కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పోటీచేస్తున్నట్లు తొలి జాబితాలోనే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించేశారు. దీంతో మార్పులు, చేర్పులు జరిగితే కచ్చితంగా సీటు దక్కుతుందని.. లేదా వేరే నియోజకవర్గం అయినా అధిష్టానం ఇస్తుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (Alapati Rajendra Prasad) ఆశించారు. అయితే మార్పులు జరగకపోగా.. కనీసం మూడో జాబితాలో అయినా తనపేరు ఉంటుందని ఆలపాటి ఎంతో ఆశతో ఉన్నారు. సీన్ కట్ చేస్తే.. పేరు లేదు.. వేరే నియోజకవర్గానికి మార్పూ లేదు. వాస్తవానికి తెనాలి సీటు జనసేనకు కేటాయించిన తర్వాత.. రాజాకు ప్రత్యామ్నాయం చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరకపోవడంతో ఆలపాటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.


Untitled-6.jpg

వాట్ నెక్స్ట్..?

టికెట్ రాకపోవడంతో ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని రాజా భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తెనాలిలో ఆత్మీయులతో ఆలపాటి సమావేశం కాబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాజా టీడీపీని వీడుతారని తెలియవచ్చింది. అభిమానులు, కార్యకర్తల సమక్షంలోనే పార్టీ మార్పు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెప్పాల్సి వస్తే.. ఏ పార్టీలో చేరతారు..? బీజేపీలోకి వెళ్తారా లేకుంటే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. అయితే.. తొలి జాబితా రిలీజ్ అయిన మరుక్షణమే వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని తెనాలిలో పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో ప్రత్యామ్నాయం జోలికి వెళ్లలేదనే టాక్ కూడా నడుస్తోంది. ఫైనల్‌గా ఆలపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

TDP-JANASENA-BJP-PATH.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 02:45 PM