Share News

AP Elections 2024: ఇక్కడ ఒక్కసారి ఓడితే.. మళ్లీ గెలవడం కష్టమే!

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:06 AM

ఈ నియోజకవర్గంలో పోటీ చేసినవారు ఒకసారి ఓడిపోతే ఇక అంతే సంగతులు. రెండోమారు మళ్లీ గెలిచిన సందర్భాలు లేవు. గంటెల సుమన, చెంగల వెంకట్రావు, కాకర నూకరాజు పాయకరావుపేట నుంచి పలుమార్లు పోటీ చేశారు. అయితే ముగ్గురూ ఒకసారి ఓడిపోయిన తరువాత

AP Elections 2024: ఇక్కడ ఒక్కసారి ఓడితే.. మళ్లీ గెలవడం కష్టమే!

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట (Payakaraopet) నియోజకవర్గంలో పోటీ చేసినవారు ఒకసారి ఓడిపోతే ఇక అంతే సంగతులు. రెండోమారు మళ్లీ గెలిచిన సందర్భాలు లేవు. గంటెల సుమన, చెంగల వెంకట్రావు, కాకర నూకరాజు పాయకరావుపేట నుంచి పలుమార్లు పోటీ చేశారు. అయితే ముగ్గురూ ఒకసారి ఓడిపోయిన తరువాత ఎన్నిసార్లు పోటీ చేసినా తిరిగి గెలవలేదు. 1983 ఎన్నికల్లో టీడీపీ (Telugu Desam Party) తరపున తొలిసారిగా గెలుపొందిన గంటెల సుమన ఆ తరువాత నాదెండ్ల భాస్కరరావుకు మద్దతు తెలిపి టీడీపీకి దూరమయ్యారు. అనంతరం 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కాకర నూకరాజు మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకర నూకరాజుకి ప్రత్యర్థిగా, అదేవిధంగా 1999లో టీడీపీ తరపున తొలిసారిగా పోటీ చేసిన చెంగల వెంకట్రావుకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ (Congress) తరపున గంటెల సుమన పోటీ చేసి...ఆ మూడు ఎన్నికల్లోనూ వరుసగా ఓటమి పాలయ్యారు. 1999 ఎన్నికల్లో అన్న తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన కాకర నూకరాజు మూడో స్థానంలో నిలిచారు. అదేవిధంగా 2004లో టీడీపీ తరపున చెంగల వెంకట్రావు రెండోసారి పోటీ చేయగా.. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన ఎ.విజయరావుతోపాటు ఇండిపెండెంట్‌గా పోటీలో నిలుచున్న గంటెల సుమన ఓటమిపాలయ్యారు.


Payakaraopet-name-board.jpg

2009-19 వరకూ ఇలా!

2009లో టీడీపీ తరపున మూడోసారి బరిలోకి దిగిన చెంగల వెంకట్రావు కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్ల బాబూరావు చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత 2012 ఉప ఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేసిన గొల్ల బాబూరావు విజయం సాధించగా టీడీపీ టికెట్టుపై పోటీచేసిన చెంగల వెంకట్రావు, కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన గంటెల సుమన ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన చెంగల వెంకట్రావు ఓటమి చెందారు. ఇక 2019లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన కాకర నూకరాజు నోటా కంటే తక్కువ ఓట్లు సాధించి ఓడిపోయారు. ఇలా గంటెల సుమన ఒకసారి ఎన్నికల్లో ఓడిన తరువాత ఐదుసార్లు పోటీచేసినా గెలవలేకపోయారు. అదేవిధంగా చెంగల వెంకట్రావు, కాకర నూకరాజు ఒక సారి ఓటమిపాలైన తరువాత రెండు పర్యాయాలు పోటీ చేసినా గెలవలేదు.

Anitha-Vs-Jogulu.jpg

ఇప్పుడిలా..!

కాగా.. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున కంబాల జోగులు బరిలో ఉండగా.. కూటమి తరఫున వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు. కాగా.. అనిత 2014 ఎన్నికల్లో ఇక్కడ్నుంచి 2,828 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక జోగులు ఈ నియోజకవర్గం నుంచి ఒక్కసారి పోటీ చేయలేదు.. ఇదే తొలిసారి. అయితే.. 2004లో పాలకొండ, 2014 ఎన్నికల్లో రాజాం నుంచి, 2019లో కూడా రాజాం నుంచి పోటీచేసి మొత్తం మూడుసార్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో పాయకరావుపేటకు వైసీపీ హైకమాండ్ ట్రాన్స్‌ఫర్ చేసింది. దీంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న జోగులు గెలుస్తారా..? లేకుంటే ఇదివరకే ఒకసారి గెలిచిన అనిత గెలుస్తారా..? అనేది చూడాలి. అయితే.. ఒక్కసారి ఓడితే.. మళ్లీ గెలవడం కష్టమేనన్న హడావుడితో అటు వైసీపీలో.. ఇటు కూటమిలోనూ టెన్షన్ మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

1THREE-PARTIES-LOGO.jpg

Updated Date - Apr 21 , 2024 | 09:18 AM