Share News

AP Elections 2024: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఒంటరిపోరాటం.. చుక్కలు చూపిస్తున్నారుగా!!

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:23 AM

ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లోనే (Andhra Pradesh) కాదు. దేశంలోనే పేరున్న కేన్సర్‌ వైద్యుల్లో ఒకరు. ఆయన తండ్రి దేవుడి మంత్రిగా పేరొందిన వ్యక్తి. ఆయన ఇమేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు వైసీపీ (YSR Congress) పెద్దలు స్కెచ్‌ వేశారు. ముగ్గులోకి దింపారు. తొలుత అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ కేటాయించారు. వైసీపీ పెద్దల మాటలు నమ్మి...

AP Elections 2024: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఒంటరిపోరాటం.. చుక్కలు చూపిస్తున్నారుగా!!

ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లోనే (Andhra Pradesh) కాదు. దేశంలోనే పేరున్న కేన్సర్‌ వైద్యుల్లో ఒకరు. ఆయన తండ్రి దేవుడి మంత్రిగా పేరొందిన వ్యక్తి. ఆయన ఇమేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు వైసీపీ (YSR Congress) పెద్దలు స్కెచ్‌ వేశారు. ముగ్గులోకి దింపారు. తొలుత అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ కేటాయించారు. వైసీపీ పెద్దల మాటలు నమ్మి అన్యమనస్కంగానే రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు కొద్దిరోజులకే పరిస్థితి అర్థమయ్యేలా చేశారు వైసీపీ నాయకులు. తొలుత అవనిగడ్డ అసెంబ్లీ అని ఆ తర్వాత తూచ్‌.. అది మీ స్థాయి కాదు మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయండి అంటూ టికెట్‌ ఇచ్చారు. సరే అని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు మొదలు.. గ్రామస్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ చుక్కలు చూపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు.. మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌ (Simhadri Chandrasekhar Rao)..!


Simhadri-Chandra-Sekhar.jpg

ముక్కుసూటి మనిషి!

మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖర్‌ వచ్చింది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే అయినా ఆయనకు రాజకీయాలు మాత్రం పూర్తిగా వంటబట్టలేదు. ఆయన తండ్రి సింహాద్రి సత్యనారాయణ సైతం రాజకీయాల్లో ఉన్నంతకాలం నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారు. 2010లో సింహాద్రి సత్యనారాయణ మృతిచెందారు. తండ్రి ఉన్నప్పుడు, ఆయన తదనంతరం కూడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉన్నా ఏనాడూ చంద్రశేఖర్‌ ఆ ప్రయత్నాలు చేయలేదు. అలాంటిది ఈసారి వైసీపీ పెద్దల మాటలు నమ్మి రాజకీయాల్లోకి దిగారు. వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో పావుగా మారారు.

మార్పులు చేర్పులతో..!

దివిసీమలో సింహాద్రి సత్యనారాయణ కుటుంబానికి మంచి పేరుంది. ఆ మంచి పేరును వాడుకునేందుకు వైసీపీ పెద్దలు పావులు కదిపారు. సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేశ్‌ అవినీతి అక్రమాలతో విసిగిపోయిన అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడిస్థారని వైసీపీ పెద్దల భావించారు. దీంతో ఆయన్ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్‌ను బరిలో దింపాలని భావించారు. ఆది నుంచి అన్యమనస్కంగా ఉన్న చంద్రశేఖర్‌ తాను పోటీ చేయబోనని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈలోగా మచిలీపట్నం ఎంపీగా రమేశ్‌ సామర్థ్యం సరిపోదన్న రిపోర్టులు రావడంతో వైసీపీ పెద్దలు పునరాలోచన చేశారు. ఎంపీ అభ్యర్థిగా సరైన వ్యక్తి లేకపోతే ఆ ప్రభావం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుందని భావించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న చంద్రశేఖర్‌ను ఎంపీ అభ్యర్థిగా, రమేశ్‌ను తిరిగి అవనిగడ్డ నుంచే పోటీ చేయించేందుకు నిర్ణయించారు. ఈ పరిణామాలను జీర్ణించుకోవడానికి చంద్రశేఖర్‌కు సమయం ఇవ్వకుండా ఆయన పేరును ప్రకటించేశారు. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు చంద్రశేఖర్‌ సిద్ధమయ్యారు.


Simhadri-Chandra-Sekhar-1.jpg

కలిసి రారు.. కలుపుకొని పోరు..!

మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల సహకారం ఉంటేనే ఎంపీ అభ్యర్థి నెగ్గుకురాగలరు. కానీ, ఒకరిద్దరు మినహా పార్లమెంట్‌ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ చంద్రశేఖర్‌ను లైట్‌ తీసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు ఆయన్ను తమ నియోజకవర్గంలో పర్యటించమని కూడా కోరడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేశారు. గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. సాధారణంగా ఎంపీ అభ్యర్థి నామినేషన్‌ వేస్తున్నారంటే ఆ పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా హాజరవుతారు. భారీ ఎత్తున జనసమీకరణ చేస్తారు. కానీ, సోమవారం చంద్రశేఖర్‌ నామినేషన్‌ సమయంలో ఆ హడావిడి కనిపించలేదు. కేవలం అవనిగడ్డ నుంచి మాత్రమే ఆయన అభిమానులు తరలివచ్చారు.

కష్టమేగా డాక్టర్ సాబ్!

అభ్యర్థుల నుంచి సహాయ నిరాకరణ ఒక ఎత్తయితే, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకుల నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోవడం మరో ఎత్తులా ఉందని చంద్రశేఖర్‌ సన్నిహితులు వాపోతున్నారు. ఫలానా గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి బాలశౌరి గ్రామపెద్దలకు ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షలు ఇచ్చారని, మనం ఇవ్వకపోతే కేడర్‌ తిరిగే పరిస్థితి లేదని బెదిరింపులతో కూడిన హెచ్చరికలు రోజూ పదుల సంఖ్యలో వస్తున్నాయని సమాచారం. ప్రార్థనా మందిరాలకు ఆర్థికసాయం చేయాలని ఓ నాయకుడు.. గ్రామంలో యువకులకు క్రీడా పరికరాలు ఇవ్వాలని మరో నాయకుడు ఇలా రకరకాల ప్రతిపాదనలతో ఎంపీ కార్యాలయంలో వాలిపోతున్నారు. వీటన్నింటినీ జీర్ణించుకోవడం కష్టంగా ఉందని చంద్రశేఖర్‌ సన్నిహితులు పేర్కొన్నారు. ఇంకా రెండు వారాలకు పైగా ప్రచారం ఎలా నిర్వహిస్తారోనని వారు వ్యాఖ్యానించడం గమనార్హం.

Updated Date - Apr 23 , 2024 | 09:27 AM