Viral news: బుర్ఖా ధరించి బైక్‌పై డేంజర్ స్టంట్స్.. చివరికి యువకుల పరిస్థితి..
ABN , Publish Date - Aug 20 , 2024 | 05:58 PM
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు అద్భుతమైన వీడియోలు చేసి అందరినీ ఆకట్టుకుంటే, విచిత్రమైన విన్యాసాలు చేస్తూ మరికొందరు నవ్వుల పాలవుతుంటారు. రద్దీ ప్రాంతాల్లో, జనావాసాల్లో విచిత్రంగా ప్రవర్తించి ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు ఇంకొందరు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు అద్భుతమైన వీడియోలు చేసి అందరినీ ఆకట్టుకుంటే, విచిత్రమైన విన్యాసాలు చేస్తూ మరికొందరు నవ్వుల పాలవుతుంటారు. రద్దీ ప్రాంతాల్లో, జనావాసాల్లో విచిత్రంగా ప్రవర్తించి ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు ఇంకొందరు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని వెర్రెత్తిన ఇద్దరు యువకులు.. బుర్ఖా ధరించి నడిరోడ్డుపై బైక్ స్టంట్స్ చేశారు. రద్దీ ప్రాంతంలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి చివరికి కటకటాల పాలయ్యారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆ ప్రాంతంలో హల్‌చల్ చేశారు. బైక్ నడుపుతున్న వ్యక్తి బుర్ఖా ధరించగా అతని స్నేహితుడు వెనకాల కూర్చున్నాడు. వారిద్దరూ కలిసి బైక్‌పై స్టంట్స్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశారు. వారు చేసిన హడావిడి మెుత్తం మరో ద్విచక్రవాహనంపై ఉన్న అతని స్నేహితులు వీడియో తీశారు. అయితే ఓ ముస్లిం యువతి ఇంత బాగా ద్విచక్రవాహనం నడుపుతోందా అనేలా ప్రజల్ని ఆశ్చర్యపరచాలనే ఉద్దేశంతో వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే వారి ప్రవర్తన మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ముస్లిం యువతులు ఎదురైనప్పుడు వారు వెకిలిగా నవ్వుతూ కేకలు పెట్టారు. అలాగే ఓ యువకుడి వచ్చి ముస్లిం యువతి వేషధారణలో ఉన్న వ్యక్తికి మద్దు పెట్టాడు. వారితో చేరిన మరికొంతమంది యువకులు రోడ్లపై వీరంగం సృష్టించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.
అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో చూసి ముస్లిం ప్రజలు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మతానికి చెందిన యువతులను అపహాస్యం చేసేలా వీడియో తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోభావాలు దెబ్బతీసేలా వారి ప్రవర్తన ఉందంటూ మండిపడ్డారు. దీంతో ఆ వర్గం మతపెద్దలు తమ ప్రాంతంలో హడివిడి చేసి తమను కించపరిచేలా వ్యవహరించిన యువకులపై ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను అవమానించి, మనోభావాలు దెబ్బతీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో, సీసీ కెమెరాల ఆధారంగా యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుర్ఖా ధరించి బైక్‌పై డేంజర్ స్టంట్స్ చేసిన యువకుణ్ని, అతని స్నేహితుణ్ని గుర్తించి అరెస్టు చేశారు.
ఫేమస్ అయ్యేందుకు పిచ్చిపిచ్చి పనులు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాను సక్రమమైన మార్గంలో వినియోగించాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా వీడియోలు చిత్రించవద్దని, అత్యుత్సాహానికి పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Tummala: రైతు రుణ మాఫీ చేయడంలో బ్యాంకర్లు చొరవ తీసుకోవాలి..
Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!
For More Telangana News and Telugu News..