IND U19 vs AUS U19 Final: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ పిచ్, వెదర్ రిపోర్టు ఇదే!
ABN , Publish Date - Feb 11 , 2024 | 10:36 AM
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరులో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ ఫైనల్ పోరులో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో రెండు జట్లు ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌లో అడుగుపెట్టాయి.
బెనోని: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరులో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ ఫైనల్ పోరులో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో రెండు జట్లు ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌లో అడుగుపెట్టాయి. ముఖ్యంగా భారత జట్టు టోర్నీ అసాంతం అదరగొట్టింది. అయితే సెమీస్ పోరులో మాత్రం అతిథ్య దక్షిణాఫ్రికా నుంచి టీమిండియాకు గట్టి పోటీ ఎదురైంది. ఒకానొక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఉదయ్ సహరన్, సచిన్ దాస్ అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే విల్లోమూర్ పార్క్ పిచ్ ఎలా ఉండనుంది?.. మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.
పిచ్ రిపోర్టు
బెనోనిలోని విల్లోమూర్ పార్క్ పిచ్ బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ నుంచి మంచి సహకారం ఉంటుంది. కొత్త బంతితో మంచి పేస్ లభించడంతోపాటు బౌన్స్ అవుతుంటుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్ల కంటే, ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచాయి. ఇక్కడ ఇప్పటివరకు 27 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు మాత్రమే గెలిచాయి. అదే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 17 సార్లు గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడాయి. రెండు జట్లు కూడా టాస్ గెలిచి ముందుగా బౌలింగే ఎంచుకున్నాయి. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 233గా ఉండగా.. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 179గా ఉంది. ఇక్కడ అత్యధిక స్కోర్ 399గా ఉంది. జింబాబ్వేపై సౌతాఫ్రికా సాధించింది. అత్యధిక లక్ష్య చేధన 258గా ఉంది. సౌతాఫ్రికాపై శ్రీలంక చేధించింది. అత్యల్ప స్కోర్ 91గా ఉంది. బెర్ముడాతో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఈ స్కోర్ చేసింది.
వాతావరణ నివేదిక
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలో బెనోనిలో 40 శాతం వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీంతో మ్యాచ్‌కు కొంత ఆటంకం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనున్నాయి. 69 శాతం తేమతో కూడిన వాతావరణం ఉండొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.