IND vs ENG: క్రిస్ గేల్, జో రూట్ రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్.. ద్రావిడ్‌తో సమంగా..
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:49 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసిన హిట్‌మ్యాన్ 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 12వ సెంచరీ.
ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసిన హిట్‌మ్యాన్ 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 12వ సెంచరీ. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ రెండో రోజు ఆటలో మొదటి సెషన్‌లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 103 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్‌కు తోడు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. అయితే సెంచరీతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
1. 2019 నుంచి టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఇది 9వ సెంచరీ. దీంతో 2019 నుంచి టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో 8 సెంచరీలు చేసిన శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నే రికార్డును హిట్‌మ్యాన్ అధిగమించాడు.
2. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఇది 43వ సెంచరీ. దీంతో 42 సెంచరీలు చేసిన వెస్టిండీసీ దిగ్గజ ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. మొత్తంగా ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 49 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, 45 సెంచరీలు చేసిన భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
4. ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మకు 48వది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ క్రమంలో 47 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. 80 సెంచరీలు చేసిన కోహ్లీ, 49 సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
5. 2021 నుంచి టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 6వ సెంచరీ. దీంతో 2021 నుంచి అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
6. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు ఇంగ్లీష్ జట్టుపై నాలుగేసి సెంచరీల చొప్పున సాధించారు.
7. అంతర్జాతీయ క్రికెట్‌లో 30+ వయసు తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు 35 సెంచరీల చొప్పున సాధించారు.
8. వరల్డ్‌టెస్ట్ చాంపియన్‌షిప్‌లో రోహిత్ శర్మకు ఇది 9వ సెంచరీ. దీంతో డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 8 సెంచరీలు చేసిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ రికార్డును రోహిత్ అధిగమించాడు. 13 సెంచరీలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా ఇప్పటికే డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 9 సెంచరీలు చేయగా.. మిగతావారెవరు 4 సెంచరీలకి మంచి చేయలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.