IND vs ENG: తిరగబెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్‌ గాయం.. మిగతా సిరీస్ మొత్తానికి దూరం?

ABN , First Publish Date - 2024-02-09T14:28:09+05:30 IST

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టీమిండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది.

IND vs ENG: తిరగబెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్‌ గాయం.. మిగతా సిరీస్ మొత్తానికి దూరం?

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టీమిండియా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. తాజాగా ఈ జాబితాలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా చేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి తిరిగబెట్టింది. దీంతో అతను ఇంగ్లండ్‌తో జరిగే మిగతా 3 టెస్టులకు దూరం కానున్నాడు. ఈ మేరకు ప్రముఖ జాతీయ క్రీడా వెబ్‌సైట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. రాజ్‌కోట్ టెస్టు నేపథ్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ గాయం తిరగబెట్టింది. వెన్నెముకపై దృఢత్వం, గజ్జ ప్రాంతంలో విపరీతమైన నొప్పి వచ్చింది.


30 కంటే ఎక్కువ బంతులు ఆడిన తర్వాత వెన్ను గట్టిపడుతుందని, ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడుతున్నప్పుడు తన గజ్జలో నొప్పిగా ఉందని అయ్యర్ జట్టు మేనేజ్‌మెంట్, వైద్య సిబ్బందికి తెలియచేశాడు. వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత అయ్యర్ మొదటి సారి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. కాబట్టి అతను కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అయ్యర్ ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలోనే విశాఖ టెస్ట్ తర్వాత అయ్యర్ క్రికెట్ కిట్‌ను కూడా మూడో టెస్ట్ మ్యాచ్ జరిగే రాజ్‌కోట్‌కు కాకుండా అతని స్వగృహమైన ముంబైకి పంపినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఐపీఎల్‌లోనే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా వెన్నునొప్పికి గతేడాదే శ్రేయాస్ అయ్యర్ శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సరైన ఫామ్‌లో లేక సతమతమవుతున్న అయ్యర్‌కు గాయం పెద్ద సమస్యగా మారింది. తొలి రెండు టెస్టుల్లో 26 సగటుతో అయ్యర్ 104 పరుగులు మాత్రమే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు దూరమైతే యువ ఆటగాళ్లు అతని స్థానానికి ఎసరు పెట్టే అవకాశాలున్నాయి. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 15 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2024-02-09T14:28:11+05:30 IST