Share News

IND vs ENG: రెండో రోజు తిప్పేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?

ABN , Publish Date - Feb 24 , 2024 | 05:21 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో ధృవ్ జురేల్(30), కుల్దీప్ యాదవ్(17) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది.

IND vs ENG: రెండో రోజు తిప్పేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?

రాంచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో ధృవ్ జురేల్(30), కుల్దీప్ యాదవ్(17) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది. ఒకానొక దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ ధృవ్ జురేల్, కుల్దీప్ యాదవ్ ఆదుకున్నారు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జోరూట్(122*) అజేయ సెంచరీతో చెలరేగాడు. భారత బ్యాటింగ్ యూనిట్‌లో యశస్వీ జైస్వాల్ మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్(73) మరోసారి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ప్రధానంగా ఇంగ్లండ్ స్పిన్నర్లను ఎదుర్కొలేక మన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్(4/84), టామ్ హార్ట్‌లీ (2/47) భారత్‌ను దెబ్బతీశారు.


తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు జైస్వాల్ 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ స్పిన్నర్ షోయబ్ బషీర్ టీమిండియాను దెబ్బకొట్టాడు. వరుస విరామాల్లో 3 కీలక వికెట్లు తీశాడు. గిల్, జైస్వాల్ భాగస్వామ్యాన్ని 25వ ఓవర్‌లో విడదీశాడు. 38 పరుగులు చేసిన గిల్‌ను లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రజత్ పటీదార్(17)ను కూడా లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. 2 సిక్సులతో మంచి టచ్‌లో కనిపించిన జడేజా(12)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 130 పరుగులకే టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. 44 పరుగుల వ్యవధిలోనే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న జైస్వాల్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే తర్వాత మరోసారి చెలరేగిన బషీర్.. జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 161 పరుగులకు భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. 8 ఫోర్లు, ఒక సిక్సుతో 117 బంతుల్లో జైస్వాల్ 73 పరుగులు చేశాడు. సర్పరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్ (1)ను మరో స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ తక్కువ స్కోర్లకే ఔట్ చేశాడు. దీంతో 177 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత జట్టు 200 పరుగుల మార్కు అయినా చేరుకుంటుందో లేదో అనే అనుమానం కల్గింది. ఇలాంటి సమయంలో ధృవ్ జురేల్, కుల్దీప్ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరు టీమిండియా స్కోర్‌ను 200 దాటించారు. ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 42 పరుగులు జోడించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

కాగా అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. 302/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించింది. ఒలీ రాబిన్సన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాబిన్సన్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. 103వ ఓవర్ నుంచి టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా చెలరేగాడు. రాబిన్సన్(58)ను ఔట్ చేసి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. రూట్, రాబిన్సన్ కలిసి ఎనిమిదో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఆ తర్వాత షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్‌ను డకౌట్ చేశాడు. దీంతో 6 పరుగుల వ్యవధిలో ఇంగ్లీష్ జట్టు తమ చివరి 3 వికెట్లను కోల్పోయింది. సెంచరీ చేసిన రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 05:27 PM