Share News

IND vs ENG: తీవ్ర అసహనంతో క్యాప్‌ను నేలకేసి కొట్టిన రోహిత్ శర్మ.. కోపమంతా జడేజా మీదనేనా..?

ABN , Publish Date - Feb 15 , 2024 | 06:47 PM

ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. డగౌట్‌లో తీవ్ర కోపంతో ఊగిపోయాడు. కోపాన్ని ఆపుకోలేక తలపై ఉన్న క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

IND vs ENG: తీవ్ర అసహనంతో క్యాప్‌ను నేలకేసి కొట్టిన రోహిత్ శర్మ.. కోపమంతా జడేజా మీదనేనా..?

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. డగౌట్‌లో తీవ్ర కోపంతో ఊగిపోయాడు. కోపాన్ని ఆపుకోలేక తలపై ఉన్న క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఏం జరిగిందంటే.. 64వ ఓవర్‌లో రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన సర్ఫరాజ్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టెస్టు మ్యాచ్‌లో వన్డే స్టైలు బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఇంగ్లీష్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ దూకుడు చూస్తే సునాయసంగా సెంచరీ చేసేలా కనిపించాడు. దీంతో తొలి ఇన్నింగ్‌లో టీమిండియాకు భారీ స్కోర్ ఖాయమనిపించింది. కానీ జేమ్స్ అండర్సన్ వేసిన 82వ ఓవర్ ఐదో బంతికి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటికీ 99 పరుగులతో ఉన్న జడేజా ఆ బంతికి పరుగు తీసి సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించాడు. బంతి కాస్త దూరం వెళ్లడంతో పరుగు కోసం క్రీజు నుంచి బయటకు పరిగెత్తాడు. సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా పరుగు కోసం పిలిచాడు. అది చూసి సర్ఫారాజ్ ఖాన్ కూడా పరిగెత్తాడు.


కానీ ఇంతలోనే బంతి ఫీల్డర్ మార్కు వుడ్ చేతిలోకి వెళ్లింది. ఇది గమనించిన జడేజా వెంటనే మనసు మార్చుకుని వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ కూడా వెనక్కి వెళ్లబోయాడు. కానీ అప్పటికే మార్కు వుడ్ డైరెక్ట్ త్రోతో స్టంప్స్‌ను కొట్టాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడు. ఈ షాకింగ్ ఘటనతో డగౌట్‌లోని టీమిండియా ఆటగాళ్లు, సిబ్బందితోపాటు స్టేడియంలోని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో తీవ్రంగా నిరాశ చెందిన రోహిత్ శర్మ అసహనంతో తన తలపై ఉన్న టోపీ(క్యాప్)ని తీసి నెలకేసికొట్టాడు. ఒకవేళ జడేజా పిలవకపోయి ఉంటే సర్ఫరాజ్ ఖాన్ పరుగు కోసం వచ్చేవాడు కాదు. కానీ బంతిని సరిగ్గా చూసుకోకుండానే సర్ఫరాజ్‌ను జడేజా పరుగుకు పిలిచాడు. బంతి ఫీల్డర్ చేతికి చిక్కడంతో తాను వెనక్కి వెళ్లి తప్పించుకున్నాడు. కానీ జడేజా వెనక్కి వెళ్లడంతో సర్ఫరాజ్ ఖాన్ బుక్కైపోయాడు. దీంతో జడేజా వ్యవహారం పట్ల అసహనంతోనే రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడని ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు అంటున్నారు. సెంచరీ పూర్తి చేయాలనే తన స్వార్థం కోసం సర్ఫరాజ్ ఖాన్‌ను బలి చేశాడని పలువురు నెటిజన్లు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు జడేజా మద్దతుగా ఉండి, తన వికెట్ త్యాగం చేయాల్సిందని మరి కొంతమంది అంటున్నారు.

కాగా జడేజా తప్పిదం కారణంగా మంచి ఊపులో ఉన్న బ్యాటర్ రనౌట్ కావడం ఇది కొత్తేం కాదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా జడేజా తప్పిదం కారణంగా హార్దిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ధాటిగా బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 43 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. కానీ జడేజా కారణంగా అనూహ్యంగా రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతుల్లో నుంచి జారిపోయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(110), కుల్దీప్ యాదవ్(1) ఉన్నారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ(131) సెంచరీతో చెలరేగాడు. ధాటిగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్(62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 06:48 PM