Share News

IND vs SA 2nd Test: నిప్పులు చిమ్మిన టీమిండియా బౌలర్లు.. సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన సౌతాఫ్రికా!

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:45 PM

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు నిప్పులుకక్కారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) విశ్వరూపం చూపించాడు.

IND vs SA 2nd Test: నిప్పులు చిమ్మిన టీమిండియా బౌలర్లు.. సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన సౌతాఫ్రికా!

కేప్‌టౌన్: భారత్, సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు నిప్పులు చిమ్మారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) విశ్వరూపం చూపించాడు. ఆరంభం నుంచే నిప్పులు చిమ్మిన సిరాజ్ సౌతాఫ్రికా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. సిరాజ్‌కు ముఖేష్ కుమార్(2/0), జస్ప్రీత్ బుమ్రా (2/25) కూడా తోడవడంతో సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మన పేసర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. 15 పరుగులు చేసిన కైల్ వెర్రెయిన్నే సౌతాఫ్రికా జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Untitled-11.jpg


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 3 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్‌ను 9వ ఓవర్లో బుమ్రా ఔట్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే సిరాజ్ మియా మరోసారి చెలరేగడంతో 2 పరుగులే చేసిన వన్‌డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా దూడుకు కొనసాగించిన సిరాజ్.. ఒకే ఓవర్‌లో 12 పరుగులు చేసిన డేవిడ్ బెడింగ్‌హామ్‌తోపాటు మార్కో జాన్సెన్‌ను డకౌట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే మరోసారి చెలరేగిన సిరాజ్.. 15 పరుగులు చేసిన కైల్ వెర్రెయిన్నే ను ఔట్ చేశాడు. దీంతో ఇక సఫారీ జట్టు ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ముఖేష్ కుమార్, బుమ్రా టేలెండర్ల భరతం పట్టారు. కేశవ్ మహారాజ్(3), రబాడను(5) ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చగా.. బర్గర్‌ను(4)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌటైంది. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. అలాగే టెస్టుల్లో మన జట్టు ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన అతి తక్కువ స్కోర్ కూడా ఇదే.

Updated Date - Jan 03 , 2024 | 04:11 PM