RCB vs PBKS: బెంగళూరు vs పంజాబ్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..
ABN , Publish Date - Mar 25 , 2024 | 04:07 PM
ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో పోరుకు సిద్దమైంది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది.
బెంగళూరు: ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో పోరుకు సిద్దమైంది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో విఫలమైన తమ టాపార్డర్ ఈ మ్యాచ్‌లో రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక తమ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచిన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీపై కూడా గెలిచి తమ దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్టు ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.
సాధారణంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడి బౌండరీలు కూడా చిన్నవి కావడంతో బ్యాటర్లు పండుగ చేసుకుంటారు. ఈ పిచ్‌పై గతంలో ఇదే జరిగింది. కాబట్టి ఈ సీజన్‌లో కూడా పరుగుల వరద పారే అవకాశాలున్నాయి. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ, జెమీమా రోడ్రిగ్స్, కిరణ్ నవ్‌గిరే వంటి బ్యాటర్లు ఇక్కడ చెలరేగారు. అయితే డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లతో ఇక్కడి పిచ్ కాస్త పాడై ఉండొచ్చు. కానీ డబ్ల్యూపీఎల్ ముగిసి 3 వారాలు కావడంతో క్యూరేటర్లు పిచ్‌ను మళ్లీ పాత స్థానానికి తీసుకొచ్చారు. సాధారణంగా చిన్నస్వామి స్టేడియం పిచ్ చేజింగ్‌కు అనుకూలం. గత రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్ల కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 37 మ్యాచ్‌ల్లో గెలవగా.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు అత్యధికంగా 47 మ్యాచ్‌ల్లో గెలిచాయి. బౌండరీలు చిన్నవి కావడంతో మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ సాధించినా కాపాడుకోవడం కష్టం. గతంలో రికార్డు చేజింగ్‌లు కూడా నమోదయ్యాయి. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరులో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 166గా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.