Narendra Modi: షమీ శస్త్ర చికిత్సపై స్పందించిన ప్రధాని మోదీ.. ఎమోషనలైన టీమిండియా పేసర్
ABN , Publish Date - Feb 27 , 2024 | 03:08 PM
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కాలి చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం ఎంతకీ తగ్గకపోవడంతో తాజాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కాలి చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం ఎంతకీ తగ్గకపోవడంతో తాజాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని షమీనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. తన కాలి మడమకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని పేర్కొన్నాడు. అయితే తాను కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. తాను మైదానంలోకి అడుగుపెట్టడానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. దీంతో మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని అభిమానులతోపాటు తోటి క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు.
ఈ క్రమంలో షమీ శస్త్ర చికిత్సపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా షమీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘మీరు మంచి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలి. మీరు ఈ గాయం నుంచి త్వరగా కోలుకుంటారనే నమ్మకం నాకుంది.’’ అని రాసుకొచ్చారు. అయితే తన శస్త్ర చికిత్సపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడంతో మహ్మద్ షమీ భావోద్వేగానికి గురయ్యాడు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ నుంచి ఒక నోట్ అందుకోవడం తనకు చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ నుంచి ఒక నోట్ అందుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన దయ, ఆలోచనాత్మకత నిజంగా నాకు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీ మద్దతు, శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా ధన్యవాదాలు మోదీ సార్. త్వరగా కోలుకోవడానికి నేను కష్టపడుతూనే ఉంటాను. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.’’ అని రాసుకొచ్చాడు. కాగా శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని సమాచారం. దీంతో రానున్న ఐపీఎల్‌తోపాటు జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు కూడా షమీ దూరమయ్యే అవకాశాలున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.