Share News

SRH vs MI: సన్‌రైజర్స్ బ్యాటర్ల విశ్వరూపం.. ముంబై ముందు కొండంత లక్ష్యం

ABN , Publish Date - Mar 27 , 2024 | 09:31 PM

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. మూకుమ్మడిగా ముంబై బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మాక్రమ్ ఇలా ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు.

SRH vs MI: సన్‌రైజర్స్ బ్యాటర్ల విశ్వరూపం.. ముంబై ముందు కొండంత లక్ష్యం

హైదరాబాద్: ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. మూకుమ్మడిగా ముంబై బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మాక్రమ్ ఇలా ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. వీరి విధ్వంసం ధాటికి ముంబై బౌలర్లు ఇలా బంతి వేశారో లేదో అలా బౌండరీ లైన్ దాటింది. వరుసగా ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టించారు. సన్‌రైజర్స్ సంచలన బ్యాటింగ్‌తో బంతులు ఆకాశం మీది నుంచి కురుస్తున్నాయేమో అనే భావన కల్గింది. హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోతతో ముంబై ఫీల్డర్లు ప్రేక్షకుల్లా.. ప్రేక్షకులు ఫీల్డర్ల మాదిరిగా మారిపోయారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే సన్‌ రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 277/3 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 278 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మాక్రమ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. 34 బంతులు ఎదుర్కొన్న క్లాసన్ 4 ఫోర్లు, 7 సిక్సులతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో ట్రావిస్ హెడ్ 62 పరుగులు చేయగా.. 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో అభిషేక్ శర్మ 63 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 బంతుల్లో 42 పరుగులు చేసిన మాక్రమ్ నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ముంబై బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. క్వేనా మఫాకా, గెరాల్డ్ కోయెట్జీ అయితే తమ 4 ఓవర్ల కోటాలో ఏకంగా 66, 57 పరుగులు సమర్పించుకున్నారు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని అందించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. క్వేనా మఫాకా వేసిన మూడో ఓవర్లో ట్రావిస్ హెడ్ వరుసగా 2 సిక్సులు, 2 ఫోర్లు బాదడంతో 22 పరుగులొచ్చాయి. మూడో ఓవర్ నుంచి ప్రారంభమైన సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోత ఎక్కడా తగ్గలేదు. హార్దిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికే మయాంక్ అగర్వాల్(11) ఔట్ కావడంతో 45 పరుగుల వద్ద హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆ ఓవర్ చివరి 3 బంతులను హెడ్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. గెరాల్డ్ కోయెట్జీ వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్ శర్మ ఓ సిక్సు, హెడ్ 2 ఫోర్లు, ఓ సిక్సు బాదడంతో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ జట్టు వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ, ట్రావిస్ హుడ్ మరింత రెచ్చిపోయారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 22 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు.

పీయూష్ చావ్లా వేసిన 7వ ఓవర్‌లో అభిషేక్ శర్మ 3 సిక్సులు బాదడంతో 21 పరుగులొచ్చాయి. దీంతో 7 ఓవర్లలోనే సన్‌రైజర్స్ స్కోర్ 100 పరుగులు దాటింది. అయితే గెరాల్డ్ కోయెట్జీ వేసిన 8వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. దీంతో 113 పరుగుల వద్ద హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. 24 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు చేశాడు. అనంతరం మాక్రమ్‌తో కలిసి అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. క్వేనా మఫాకా వేసిన 10వ ఓవర్‌లో 2 సిక్సులు, 2 ఫోర్లు బాదడంతో 20 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో 16 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలోనే సన్‌రైజర్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అయితే పీయూష్ చావ్లా వేసిన 11వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ శర్మ ఔటయ్యాడు. దీంతో 161 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే బాధ్యతను మాక్రమ్, క్లాసెన్ తీసుకున్నారు. ఓవర్‌కు 10 పరుగులకు తగ్గకుండా రాబట్టారు. దీంతో 14.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ స్కోర్ 200కు చేరుకుంది. క్వేనా మఫాకా వేసిన 17వ ఓవర్‌లో క్లాసెన్ ఓ ఫోర్, సిక్సు, మాక్రమ్ ఓ ఫోర్ బాదడంతో 18 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో 5 సిక్సులు, ఒక ఫోర్‌తో క్లాసెన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కూడా వీరి దూకుడు కొనసాగింది. దీంతో 18.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ స్కోర్ 250 పరుగులకు చేరుకుంది. ములాని వేసిన చివరి ఓవర్లో 21 పరుగులొచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. క్లాసెన్, మాక్రమ్ కలిసి నాలుగో వికెట్ కు 54 బంతుల్లోనే అజేయంగా 116 పరుగులు జోడించారు. క్లాసెన్ 80, మాక్రమ్ 42 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ తలో వికెట్ తీశారు.

Updated Date - Mar 27 , 2024 | 09:54 PM