Share News

Hanuma Vihari: ఇకపై ఆంధ్ర జట్టుకు ఆడను.. ఆ రాజకీయనేత వల్లే ఇదంతా..

ABN , Publish Date - Feb 26 , 2024 | 06:55 PM

టీమిండియా క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు హనుమ విహారీ సంచలన ప్రకటన చేశాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపించాడు. అలాగే తాను ఇకపై ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడనంటూ 30 ఏళ్ల హనుమ విహారీ వెల్లడించాడు.

Hanuma Vihari: ఇకపై ఆంధ్ర జట్టుకు ఆడను.. ఆ రాజకీయనేత వల్లే ఇదంతా..

టీమిండియా క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు హనుమ విహారీ సంచలన ప్రకటన చేశాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపించాడు. అలాగే తాను ఇకపై ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడనంటూ 30 ఏళ్ల హనుమ విహారీ వెల్లడించాడు. రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్ర జట్టు 4 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఈ సీజన్ రంజీ ట్రోఫీ నుంచి ఆంధ్ర జట్టు నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం ఆంధ్ర జట్టు మాజీ కెప్టెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా చేసిన పోస్టులో కీలక విషయాలు వెల్లడించాడు. ఈ రంజీ సీజన్ తొలి మ్యాచ్‌లో జట్టులోని 17వ ఆటగాడిపై అరిచానని పేర్కొన్నాడు. వాళ్ల నాన్న రాజకీయ నాయకుడని, దీంతో జట్టు మేనేజ్‌మెంట్ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోరినట్టు పేర్కొన్నాడు. ఫలితంగా తాను కెప్టెన్సీ కోల్పోవల్సి వచ్చిందని విహారీ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా తొలి మ్యాచ్ తర్వాత విహారీ స్థానంలో ఆంధ్ర జట్టుకు టోర్నీ మొత్తం రికీ భుయ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.


విహారీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘‘మేము చివరి వరకు తీవ్రంగా పోరాడాము. కానీ ఇది జరగాలని అనుకోలేదు. ఆంధ్ర జట్టు మరో ఓటమిని చవిచూసింది. కొన్ని వాస్తవాల గురించి తెలియజేయడానికే ఈ పోస్ట్ మీ ముందుంచాలని అనుకుంటున్నాను. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేను కెప్టెన్‌గా ఉన్నాను. ఆ మ్యాచ్‌లో నేను జట్టులోని 17వ ఆటగాడిపై అరిచాను. అయితే అతని తండ్రి ఒక రాజకీయ నాయకుడు. దీంతో ఆ వ్యక్తి తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు రాజకీయ నాయకుడు నాపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర అసోసియేషన్‌ను కోరారు. తొలి మ్యాచ్‌లో గతేడాది ఫైనల్ చేరిన బెంగాల్‌ జట్టుపై 410 పరుగులు చేధించి గెలిచాం. అయినా ఎలాంటి పొరపాటు చేయకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నన్ను క్రికెట్ అసోసియేషన్ కోరింది. నేను ఆ ఆటగాడితో వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఆటలో భాగంగానే అరించాను. ఆంధ్ర జట్టు తరఫున నా 7 సంవత్సరాల కెరీర్‌లో చాలా చేశాడు. ఆంధ్ర జట్టును 5 సార్లు నాకౌట్ చేర్చాను. గత సంవత్సరం ఓ మ్యాచ్‌లో నాకు గాయం అయింది. అయినా నేను దానిని పట్టించుకోకుండా నా శరీరాన్ని పణ్ణంగా పెట్టి ఎడమ చేతితో బ్యాటింగ్ చేశాను. టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడాను. అయినా నా కంటే ఆ ఆటగాడే ముఖ్యమని అసోసియేషన్ భావించింది. దీంతో నేను ఇబ్బంది పడ్డాను. కానీ నేను ఈ సీజన్‌లో ఆడటం కొనసాగించడానికి కారణం క్రికెట్, జట్టుపై నాకున్న గౌరవమే. బాధాకరమైన విషయమేమిటంటే.. తమ వల్లే ఆటగాళ్లు ఉన్నారని, తాము ఏది చెప్పినా ఆటగాళ్లు వినాల్సిందేనని అసోసియేషన్ భావిస్తోంది. నేను ఇది అవమానంగా, ఇబ్బందిగా భావించాను. కానీ నేను ఈ రోజు వరకు దానిని వ్యక్తపరచలేదు. నా ఆత్మగౌరవం కోల్పోయిన ఆంధ్ర జట్టు తరఫున ఇకపై ఎప్పటికీ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. నేను జట్టును ప్రేమిస్తున్నాను. ప్రతి సీజన్‌లో మనం ఎదుగుతున్న తీరు నాకు నచ్చింది. కానీ మేం ఎదగడం అసోసియేషన్‌కు ఇష్టం లేదు'' అని పేర్కొన్నాడు.

కాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 124 మ్యాచ్‌లాడిన హనుమ విహారీ 51 సగటుతో 9325 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలున్నాయి. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 16 టెస్టులాడిన విహారీ 33 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 07:12 PM