Share News

GST Fraud: జీఎస్టీ కుంభకోణం కేసు సీఐడీకి బదిలీ..

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:32 AM

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన రూ. 1400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు పూర్తిస్థాయిలో సీఐడీకి బదిలీ అయ్యింది. తొలుత హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా.. తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

GST Fraud: జీఎస్టీ కుంభకోణం కేసు సీఐడీకి బదిలీ..

  • దర్యాప్తు అధికారితో సీఐడీ చీఫ్‌ భేటీ.. త్వరలోనే నోటీసుల పర్వం

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన రూ. 1400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు పూర్తిస్థాయిలో సీఐడీకి బదిలీ అయ్యింది. తొలుత హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా.. తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌(185/2024)ను గురువారం సీఐడీ అధికారులకు అప్పగించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఐడీ చీఫ్‌ షికాగోయల్‌ హైదరాబాద్‌ తిరిగి రావడంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. వచ్చీరాగానే ఆమె సీఐడీ దర్యాప్తు అధికారి(ఐవో)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


ప్రభుత్వం స్వయంగా విచారణకు ఆదేశించడం.. మాజీ సీఎ్‌సగా, ప్రభుత్వ సలహాదారుగా సేవలందించిన వ్యక్తి నిందితుడిగా ఉండడంతో పకడ్బందీగా దర్యాప్తునకు అనుసరించాల్సిన విధానాలపై ఆమె దిశానిర్దేశం చేశారు. కాగా.. ఎలాంటి వస్తువులను సరఫరా చేయకుండానే.. 75 కంపెనీలు రూ.1,400 కోట్ల మేర ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ కెడిట్‌(ఐటీసీ)ని క్లెయిమ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాణిజ్యపన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ కేసులో మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తోపాటు.. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ ఎస్వీ కాశీవిశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్‌ శివరామ్‌ ప్రసాద్‌ తదితరులు నిందితులుగా ఉన్నారు. వీరికి నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచేందుకు సీఐడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - Aug 02 , 2024 | 04:32 AM