531 సర్కారు వైద్యుల పోస్టులు..
ABN , Publish Date - Jun 16 , 2024 | 03:30 AM
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా డీహెచ్ పరిధిలోని 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతోపాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
193 ల్యాబ్ టెక్నీషియన్,
31 స్టాఫ్ నర్సు పోస్టులు కూడా..
భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల
వారంలోగా ఏఎన్‌ఎమ్ రాత పరీక్ష!
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా డీహెచ్ పరిధిలోని 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతోపాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు (ఎల్టీ), స్టాఫ్ నర్సుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత అధికంగా ఉంది. ఈ సమస్యను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ) త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. నియామకాల అనంతరం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌ను బట్టి సర్జన్లను నియమించనున్నారు. అలాగే ఎల్టీ, స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ ఉండనుంది. ఇదిలా ఉండగా.. వారంలోగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ-ఏఎన్‌ఎమ్) రాత పరీక్ష తేదీని వెల్లడించే అవకాశం ఉంది. సుమారు 1,900 పోస్టుల భర్తీకిగాను గతేడాది జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్షా తేదీ సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు రాత పరీక్ష నిర్వహించి వెంటనే ఆ పోస్టులను భర్తీ చేయాలని మెడికల్ బోర్డును సర్కారు ఆదేశించింది.