Share News

CV Anand: లంచావతారుల గుండెల్లో గుబులు!

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:23 AM

రాష్ట్రంలో కొద్దిరోజులుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరుపుతున్న దాడులతో లంచావతారుల్లో గుబులు మొదలైందంటున్నారు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌. గత 6 నెలలుగా ఏసీబీ చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులు..

CV Anand: లంచావతారుల గుండెల్లో గుబులు!

  • ఏసీబీ వరుస దాడులతో అధికారుల్లో భయం

  • ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా.. పనులు జరుగుతున్నాయి: ఏసీబీ చీఫ్‌ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొద్దిరోజులుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరుపుతున్న దాడులతో లంచావతారుల్లో గుబులు మొదలైందంటున్నారు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌. గత 6 నెలలుగా ఏసీబీ చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులు.. అవినీతి ఉద్యోగులందరిలో భయం పుట్టిస్తున్నాయని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన పేర్కొన్నారు. అనుమానిత అధికారులు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రతి విషయాన్నీ అనుమానాస్పదంగా చూస్తున్నారని తెలిపారు. దీంతో వారిని ట్రాప్‌ చేసి పట్టుకునేందుకు తమ సిబ్బంది మరింత కష్టపడాల్సి వస్తుందన్నారు. అయితే ఇంత జరుగుతున్నా.. లంచాలకు అలవాటుపడ్డ కొందరి అత్యాశ వారిని ట్రాప్‌లో పడేలా చేస్తోందన్నారు.


ఏదేమైనా ఏసీబీ దాడుల కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో ప్రజలు లంచాలు ఇవ్వకుండా సులభంగా తమ పనులు చేయించుకోగలుగుతున్నట్లు తెలుస్తోందని సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు తమ వంతు ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తామన్నారు. సీవీ ఆనంద్‌ చేసిన ఈ పోస్ట్‌తో ఏసీబీ పనితీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సుమారు 90 వరకు ట్రాప్‌, ఆదాయానికి మించిన కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ఆరు నెలల్లో ఈ స్థాయిలో ఏసీబీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

Updated Date - Jul 07 , 2024 | 03:23 AM