Share News

Hyderabad: గొర్రెల కేసులో తెరపైౌకి కొత్త పేర్లు!

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:07 AM

గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన రూ.700 కోట్ల కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాంచందర్‌ నాయక్‌, కల్యాణ్‌ల 3 రోజుల ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులను ఉదయం కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు.

Hyderabad: గొర్రెల కేసులో తెరపైౌకి  కొత్త పేర్లు!

  • ముగిసిన రాంచందర్‌, కల్యాణ్‌ కస్టడీ

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన రూ.700 కోట్ల కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాంచందర్‌ నాయక్‌, కల్యాణ్‌ల 3 రోజుల ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులను ఉదయం కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసిన సమయంలో రాంచందర్‌ నాయక్‌ తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓగా కీలక బాధ్యతల్లో ఉండగా, కల్యాణ్‌ అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి వద్ద ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించారు. మూడు రోజుల కస్టడీలో ఏసీబీ అధికారులు వీరిద్దరినీ వేర్వేరుగా విచారించి వందకుపైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.


సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవటానికి నిందితులు ప్రయత్నించినప్పటికీ.. అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాల్ని ముందు పెట్టి ప్రశ్నించటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు నోరు విప్పినట్లు సమాచారం. కేసుతో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు వెల్లడించారని, దీంతో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఈ కేసులో కొత్తగా వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ఈ నేపథ్యంలో మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.


కంప్యూటర్‌ ఆపరేటర్లు కీలకం

గొర్రెల పథకం అమలులో నకిలీ బిల్లులు, ఇన్వాయి్‌సలు సృష్టించి రైతుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వందల కోట్లు దారి మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పట్టుబడ్డ వారిని విచారించిన సమయంలో ఎవరి ఆదేశాల మేరకు పనిచేయాల్సి వచ్చింది, డబ్బుల్లో ఎవరి వాటా ఎంత అనే వివరాలు రాబట్టారు. ఈ కేసులో కంప్యూటర్‌ ఆపరేటర్లు కీలక సాక్ష్యాధారాలు అందించే అవకాశం ఉందని, వారిని విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్ల సహకారంతోనే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఆంబులెన్స్‌ల ఫొటోలు అప్‌లోడ్‌ చేసి, బిల్లులు ఎంట్రీ చేశారు.


ఆ వివరాల మేరకు బిల్లులు చెల్లింపు జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు చెబితే ఆ వివరాల్ని కంప్యూటర్లలో పొందుపర్చారనే సమాచారాన్ని స్వయం గా ఆపరేటర్ల నుంచి తీసుకుంటే కేసులో పురోగతి ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు, గొర్రెలు విక్రయించిన వారి పేరిట వివిధ బ్యాంకుల్లో ప్రభుత్వం నుంచి డిపాజిట్‌ అయిన నగదు వివరాలను కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ మేరకు వివిధ బ్యాంకులకు లేఖలు రాస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jun 13 , 2024 | 03:08 AM