Share News

Sangareddy: సస్పెన్షన్‌లో ఉన్నా లంచం ఇవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:24 AM

సస్పెన్షన్‌లో ఉన్నా.. లంచం విషయంలో తగ్గేది లేదంటూ వసూళ్లకు పాల్పడిన ఓ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు.

Sangareddy: సస్పెన్షన్‌లో ఉన్నా లంచం ఇవ్వాల్సిందే..

  • 5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌

  • 30 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన దమ్మాయిగూడ మునిసిపల్‌ కమిషనర్‌

హైదరాబాద్‌ సిటీ/సంగారెడ్డి క్రైం/కీసర రూరల్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): సస్పెన్షన్‌లో ఉన్నా.. లంచం విషయంలో తగ్గేది లేదంటూ వసూళ్లకు పాల్పడిన ఓ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు. సంగారెడ్డి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మట్టపర్తి సాయి వెంకటకిషోర్‌ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతేడాది అమీన్‌పూర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మెరుగు రవిగౌడ్‌ను భూవిక్రయ కేసు విషయంలో అరెస్ట్‌ చేసి భూమి దస్తావేజులు తీసుకుని తన దగ్గర పెట్టుకున్నారు. ఆ కేసులో జైలుకు వెళ్లిన రవిగౌడ్‌.. ఇటీవలే విడుదలై భూమి పత్రాలు ఇవ్వాలని వెంకట కిషోర్‌ను కోరారు. రూ.కోటిన్నర ఇస్తేనే పత్రాలు ఇస్తానని, లేదంటే వాటిని కాల్చేస్తానని వెంకటకిషోర్‌ బెదిరించారు. తొలుత రూ.10లక్షలు తీసుకున్న వెంకటకిషోర్‌.. మిగిలిన డబ్బుల కోసం వేధిస్తున్నాడు. దీంతో రవి గౌడ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.


మియాపూర్‌లో బాధితుడి నుంచి రూ.5లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటకిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ మునిసిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య ఏసీబీకి చిక్కారు. సోమవారం ఆయన చాంబర్‌లోనే రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దమ్మాయిగూడ మునిసిపాలిటీ పరిధిలోని ఓ స్థలం విషయంలో ముషీరాబాద్‌కు చెందిన సుదర్శన్‌, అతడి వ్యాపార భాగస్వామి సత్యనారాయణకు మధ్య కోర్టులో కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. సుదర్శన్‌కు చెందిన మూడు గుంటల స్థలాన్ని సత్యనారాయణ కబ్జా చేసి అతడికి రోడ్డు లేకుండా అడ్డుగా గోడ నిర్మించాడు. ఈ నేపథ్యంలోనే ఆ గోడను కూల్చి వేసేందుకు కమిషనర్‌ రాజమల్లయ్యను సంప్రదించగా.. ఆయన రూ.60వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో సుదర్శన్‌.. ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రూ.30వేలు రాజమల్లయ్య తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 04:24 AM