Police Action: వీఆర్‌కు ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలు
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:00 AM
విధి నిర్వహణలో అక్రమాలు, అలసత్వం వహించిన పోలీసులపై వేటు పడింది. భారీ సంఖ్యలో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణా కట్టడిలో అలసత్వానికి ఫలితం..!
9 జిల్లాల అధికారులపై చర్యలు
నిఘా నివేదికతో ఐజీ చర్యలు
బాలికపై అత్యాచారం కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం.. వికారాబాద్ సీఐ సస్పెన్షన్
పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశం
హైదరాబాద్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అక్రమాలు, అలసత్వం వహించిన పోలీసులపై వేటు పడింది. భారీ సంఖ్యలో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపారు. నిఘా విభాగం నివేదిక ఆధారంగా 9 జిల్లాలకు చెందిన 16 మందిని విధుల నుంచి తప్పించారు. డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు ఐజీ సత్యనారాయణ మల్టీ జోన్-2 పరిధిలోని ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 13 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు.
ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేటుపడిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ ఇన్‌స్పెక్టర్లతో పాటు వీపనగండ్ల,, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్‌ఐ ఉన్నారు. వీరిలో కొందరు ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్ష సహకారం అందించినట్లు తేలింది. కాగా, బాలికపై అత్యాచారం కేసు దర్యాప్తులో అలసత్వం వహించిన వికారాబాద్ టౌన్ సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. ఈయన జోగిపేటలో పనిచేసినప్పుడు ఈ ఆరోపణలొచ్చాయి. మరోవైపు ఒకేసారి ఇంతమందిపై చర్యలు తీసుకోవడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది.
నిఘా విభాగం నిశిత దృష్టి
ఠాణాల్లో సిబ్బంది రోజువారీ పనితీరు, ప్రవర్తనపై నిఘా విభాగం దృష్టిసారించింది. అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిపై కన్నేసింది. ఈ క్రమంలో అందిన నివేదికల మేరకు బాధ్యులపై ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ అంటే ప్రజల్లో నమ్మకం కలిగేలా చేయడంతో పాటు, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవనే హెచ్చరిక పంపుతున్నారు. కొద్ది రోజుల కిందట అడవి దేవిపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్ మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాడెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరా్‌సపేట, తాండూరు, చిన్నంబావి ఎస్సైలను బదిలీ చేశారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించడంలో విఫలమైనందుకే వీరిపైనా చర్యలు తీసుకోవడం గమనార్హం. జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్, కొండమల్లేపల్లి హోంగార్డులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో జిల్లా కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా కట్టడిలో నిర్లక్షంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.
చౌక బియ్యం పక్క దారిపైనా..
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంపైనా పోలీస్ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే రహస్య విచారణ చేపట్టి.. ఇలాంటివారి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. స్థానికంగా రవాణా చేసేవారితో పాటు ఇతర రాష్ట్రాలకు తరలించేవారిని పట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టడంతో పాటు ప్రధాన నిందితులను పట్టుకుని చర్య తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. పేద, మద్యతరగతి వారిని దోపిడీ చేసే గ్యాంబ్లింగ్, మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామని.. ఈ బాధ్యత ఎస్పీలదేనని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా, వికారాబాద్‌లోని మర్పల్లి గెస్ట్‌హౌ్‌సలో పేకాట ఆడిస్తున్న రఫీపై ఎస్పీ సస్పెక్ట్ షీట్ తెరిచారు. మరో నిర్వాహకుడు ప్రభాకర్‌ను హెచ్చరించారు.