ఏడాదిలో మావోయిస్టులను ఏరివేస్తాం
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:59 AM
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.
వారి వల్లే గ్రామాలు అభివృద్ధి చెందలేదు.. ఇప్పటికైనా లొంగిపోవాలి
గ్రామాల్లో ఏడాదిలోపు వసతులు కల్పిస్తాం.. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు
మావోయిస్టు నేత హిడ్మా ఇలాకాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఛత్తీస్‌గఢ్‌లోని గుండం గ్రామంలో బడి ప్రారంభం.. గ్రామస్థులతో మాటామంతీ
షా రాకతో భద్రతా బలగాలతో నిండిపోయిన దండకారణ్యం
చర్ల, డిసెంబరు 16: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా మాట్లాడారు. అనంతరం గ్రామంలో చెట్టు కింద ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్థులతో మాట్లాడారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామం అభివృద్ధి చెందలేదని, పక్కా ఇళ్లు, రోడ్లు కూడా కనిపించడం లేదని, ఈ పరిస్థితికి మావోయిస్టులే ముఖ్య కారణమని అమిత్ షా అన్నారు. 2026 నాటికి ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా మావోయిస్టులు తుపాకులు వీడాలని, లొంగిపోవాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చే ఏడాదిలోపు అన్ని గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రోడ్డు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతీ పేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రభుత్వం పాఠశాల ఏర్పాటు చేసిందని, ప్రతీ చిన్నారిని బడికి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. చదువుకుంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా పోలీసు క్యాంపులో చెప్పాలని, అన్ని రకాలుగా బలగాలు ఆదుకుంటాయని తెలిపారు. ప్రతీ కుటుంబం ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలను క్యాంపులో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం అమిత్ షా సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. మావోయిస్టుల కదలికలతో పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
గుండం గ్రామం, దాని పరిసర ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. గుండం గ్రామం హిడ్మా సొంత ఊరైన పూవర్తి గ్రామానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుండం, తెర్రం, పూవర్తి గ్రామాలను మావోయిస్టు పార్టీ రాజధానులుగా పిలుస్తారు. గతంలో ఈ ప్రాంతంలోని అడవులపై నుంచి హెలికాప్టర్‌లో వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. అలాంటిది నేడు ఆయా గ్రామాలకు బలగాలు రహదారులు ఏర్పాటు చేశాయి. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హిడ్మా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పర్యటించి పోలీసు బలగాల్లో ఆత్మస్థైర్యం నింపాలనే లక్ష్యంతోనే అమిత్ షా పర్యటన సాగినట్లు తెలుస్తోంది. ఆయన వెంట ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి, బస్తర్ ఐజీ సుందర్‌రాజ్, ఇతర అధికారులు ఉన్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో దండకారణ్యం మొత్తం బలగాలతో నిండిపోయింది.