Share News

మళ్లీ తెలుగు వెలుగులు

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:33 AM

భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విద్యాలయాల్లో ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఏపీ పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు.

మళ్లీ తెలుగు వెలుగులు

  • ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో వక్తల ఆశాభావం

విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విద్యాలయాల్లో ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఏపీ పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. విజయవాడ కేబీఎన్‌ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజమహేంద్రవరంలోని బేతిని గ్రంథాలయం, విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం మన భాషా వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పాటును అందించాయని, వాటిని సాహితీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే నేటితరం పిల్లలకు భాషపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.


18 తీర్మానాలు ఆమోదం

ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో 18 తీర్మానాలను మహాసభల కార్యదర్శి జీవీ పూర్ణచందు ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి.. ఇంటా, బయట అన్ని సామాజిక జీవన ప్రామాణికాల్లో తెలుగును ఉపయోగించాలి. సమస్త జీవన విధానాలు, వృత్తుల్లో కనుమరుగైన పదాలను వెలికి తీసే బాధ్యతను రచయితలు తీసుకోవాలి. ఆంగ్ల పదాలకు సమానమైన పదాలను భాషా పండితులు, రచయితలు సృష్టించాలి. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో బోధన జరగాలి. డిగ్రీలో తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంజనీరింగ్‌, వైద్య విద్యను మాతృభాషలో బోధించాలనే కేంద్ర విధానాన్ని మహాసభలు స్వాగతించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 85ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. హైకోర్టుల్లో వాద ప్రతివాదనలు, తీర్పులు తెలుగులో జరిగేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషాఽభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్ఠంగా నిర్మించి నిఽధులు కేటాయించాలి. పాలనా వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేలా చూడాలి. వైసీపీ తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చి, దిగజార్చిన దాని ఔన్నత్యాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఏపీలో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేయాలి. సమగ్రమైన లక్ష్యాలతో వివిధ అకాడమీలను పటిష్ఠం చేయాలి. సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. గ్రంథాలయ సంస్థలను పటిష్ఠం చేసి, పుస్తకాలు కొనుగోలు చేయాలి. రాష్ట్ర గ్రంథాలయం, రాష్ట్ర మ్యూజియం ఏర్పాటు చేయాలి. తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసినవారికి ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.


ప్రభుత్వ శాఖల్లో తెలుగులో ఆదేశాలు

రాజకీయంగా సిద్ధాంతాలు వేరైనప్పటికీ, వాటిని పక్కనపెట్టి మాతృభాష పరిరక్షణ కోసం కలిసికట్టుగా ప్రయాణం చేద్దామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. తెలుగు భాషా పరిరక్షణ యజ్ఞంలో తానూ భాగస్వామినవుతానని చెప్పారు. అధికారుల కోసం తెలుగు భాషపై ఓ సదస్సు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఆదేశాలు తెలుగులో వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణ కోసం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసి భాషను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నేతలు ఉపయోగిస్తున్న భాషపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలుగు భాషకు తగినంత పదసంపద లేదని, అందుకే ఆంగ్ల పదాలను తెలుగులోకి జోడిస్తున్నారని సినీ గేయరచయిత అనంతశ్రీరాం అన్నారు. తెలుగు పదసంపదను పెంచుకోవడానికి భాషా పండితులు నిఘంటువును తయారుచేయాలని సూచించారు.


న్యాయవ్యవస్థలో తెలుగు తీర్పులకు ‘ఏఐ’

న్యాయవ్యవస్థలో తీర్పులను మాతృభాషలో ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) పరంగా ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.కృష్ణమోహనరావు తెలిపారు. ‘తెలుగులో న్యాయపాలన’ అంశంపై ఆయన మాట్లాడారు. తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఆంగ్ల పదాలకు సరిపోయే సమానార్థక పద సంపదను సృష్టించుకుని స్థిరీకరించుకోవాలని సూచించారు. తెలుగులో తీర్పును వెలువరించాలంటే అనువాదకులను నియమించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆంగ్లంలో తీర్పులు రాయడానికి 6 రోజుల సమయం పడితే, తెలుగులో రాయడానికి 40రోజులు పట్టిందని జస్టిస్‌ కె.మన్మథరావు చెప్పారు. తీర్పులు మాతృభాషలో వెలువరించాలంటే ముందుగా ప్రభుత్వాలు చట్టాలను తెలుగులోకి అనువదించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. న్యాయవ్యవస్థలో 95శాతం మంది తెలుగులోనే మాట్లాడతారని, కాగితాలు తెలుగులో ఉన్నప్పటికీ ఇంగ్లి్‌షలో మాట్లాడుతున్నామంటే మనం ఏ స్థాయికి దిగజారిపోయామో ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ భీమపాక నగేష్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 03:34 AM