Share News

Bandi Sanjay: దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చెయ్‌..

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:51 AM

మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌కు దమ్ముంటే కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికో ఇన్‌చార్జిగా ఉండి ఆయనకు డిపాజిట్‌ కూడా దక్కకుండా ఓడిస్తామని చెప్పారు.

Bandi Sanjay: దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చెయ్‌..

  • అక్బరుద్దీన్‌కు కేంద్ర మంత్రి సంజయ్‌ సవాల్‌

  • డిపాజిట్‌ కూడా దక్కనివ్వబోమని స్పష్టీకరణ

  • మజ్లిస్‌ గోడ మీది పిల్లి అని మండిపాటు

  • బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీని కాశీ, అయోధ్య తరహాలో మార్చేస్తామని వెల్లడి

  • సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక

హైదరాబాద్‌/సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌కు దమ్ముంటే కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికో ఇన్‌చార్జిగా ఉండి ఆయనకు డిపాజిట్‌ కూడా దక్కకుండా ఓడిస్తామని చెప్పారు. కొడంగల్‌ నియోజకవర్గం ఏమైనా కాంగ్రెస్‌, మజ్లిస్‌ జాగీరా? అని నిలదీశారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతామన్న వ్యక్తిని డిప్యూటీ సీఎం చేస్తామని సీఎం రేవంత్‌ చెప్పడం సిగ్గుచేటని సంజయ్‌ విమర్శించారు. ఆదివారం ఆయన చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం సమర్పించారు. పాతబస్తీలోని పలు ఆలయాలను సందర్శించారు.


ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కాశీ, అయోధ్య తరహాలో పాతబస్తీ రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయానికి రూ.10 కోట్లు కేటాయిస్తామని గత పాలకులు హామీ ఇచ్చి విస్మరించారని.. వారికి ఏ గతి పట్టిందో ప్రస్తుత పాలకులు గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రంజాన్‌ పండక్కి రూ.33 కోట్లు కేటాయిస్తే, పాతబస్తీలోని 24 దేవాలయాల కమిటీల నిర్వహణకు కేవలం రూ.5 లక్షలు ఇచ్చిందని.. బోనాలు, గణేశ్‌, దసరా ఉత్సవాలకు ఎందుకు నిధులివ్వరని ప్రభుత్వాన్ని నిలదీశారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోబోమని సంజయ్‌ హెచ్చరించారు.


‘‘నేను వాస్తవాలు మాట్లాడితే మతతత్వం అంటారా? బరాబర్‌ మాట్లాడతా. నేను ఏ మతాన్నీ కించపరచలేదు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకునే ప్రసక్తేలేదు’’ అని తేల్చిచెప్పారు. ‘‘పాతబస్తీలోని యాకత్‌పురా, కోమటివాడ, చందూలాల్‌ బారాదరి ప్రాంతాల్లో బోనాలు జరుపుకొనే పరిస్థితి లేదని ఒక పెద్దాయన వాపోయారు. అలాంటి వారందరికీ నేను హామీ ఇస్తున్నా. బీజేపీ అధికారంలోకి రాగానే, ప్రతి వీధిలో బోనాలను అధికారికంగా నిర్వహిస్తాం. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా చేస్తాం’’ అని ప్రకటించారు. తబ్లిగీ జమాతే సంస్థకు రూ.2.4 కోట్లు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా చెప్పుకొందని, ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన సంస్థకు ఇక్కడ నిధులు ఎలా ఇస్తారు? అని సంజయ్‌ నిలదీశారు.


  • మజ్లిస్‌ గోడమీది పిల్లి..

మజ్లిస్‌ గోడమీది పిల్లిలాంటి పార్టీ అని, అధికారంలో ఎవరు ఉంటే వారివైపు వెళుతుందని సంజయ్‌ దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటే కాంగ్రె్‌సను తిట్టి గులాబీ గడీలోకి వెళ్లారని.. ఇప్పుడు బీఆర్‌ఎ్‌సను తిట్టి కాంగ్రెస్‌ పంచన చేరారని ఆరోపించారు. మజ్లిస్‌ నేతలకు వాళ్ల వ్యాపారాలు బాగుంటే చాలని.. పాతబస్తీలో ట్యాక్స్‌లు, బిల్లులు కట్టవద్దన్నది వారి ఆలోచనని ఆరోపించారు.

Updated Date - Jul 29 , 2024 | 03:51 AM