Bandi Sanjay: ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలు
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:41 AM
‘అమృత్’ పథకంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
అవినీతి బయటపడాలంటే సీవీసీ విచారణ కోరాలి:సంజయ్
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘అమృత్’ పథకంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం, హైడ్రా కూల్చివేతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెండు పార్టీలు కొత్త నాటకానికి తెరదీశాయని ఆరోపించారు. తెలంగాణలో అమృత్ పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే గనక.. సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సీవీసీ)కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు భావించాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే గనక విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో తాను ప్రత్యేక చొరవ చూపుతానని చెప్పారు. దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే సదుద్దేశంతోనే మోదీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని.. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయని దుయ్యబట్టారు.