Share News

Supreme Court: మోదీ మద్దతే కీలక మలుపు..

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:32 AM

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీలో జోష్‌ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది.

Supreme Court: మోదీ మద్దతే కీలక మలుపు..

  • పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ప్రధాని కీలక ప్రకటనే టర్నింగ్‌ పాయింట్‌

  • ఆ తర్వాతే న్యాయపరమైన చిక్కులు తొలగింపునకు కమిటీ వేసిన కేంద్రం మాదిగలు ఇక మా వైపే.. కమలనాథుల్లో ధీమా

  • స్పందనపై మాత్రం వ్యూహాత్మక మౌనం.. మాలలు దూరమవుతారనేనా?

హైదరాబాద్‌, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీలో జోష్‌ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది. సుదీర్ఘకాలం కొనసాగిన వర్గీకరణ ఉద్యమంలో తమ పార్టీది కీలక పాత్ర అని పార్టీ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. వర్గీకరణకు ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చినా ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ తీసుకోవడమే కీలక మలుపు అని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ, తొలుత ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణతో పాటు మరికొందరు ముఖ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వర్గీకరణకు మద్దతుపై విస్పష్ట హామీ ఇచ్చారు.


ఆ తర్వాత నవంబరు 9న మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్సులో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్గీకరణ అంశానికి సంబంధించి న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు తొలగించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్రం, గత జనవరి 19న ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయంతో న్యాయపరంగా ప్రక్రియ వేగవంతమైంది. వర్గీకరణపై కేంద్రం కమిటీ ద్వారా తన వైఖరిని స్పష్టంగా సుప్రీంకు నివేదించింది. ఫలితంగా సామాజిక న్యాయానికి పార్టీ కట్టుబడి ఉంటామంటూ తాను ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకున్నట్లయిందని పార్టీ ముఖ్యనేత ఒకరు వివరించారు.


నాలుగు దశాబ్దాల కిందట మండల్‌ కమిషన్‌తో బీసీల్లో సామాజిక, రాజకీయ చైతన్యం వచ్చింది.. ఇప్పడు ఎస్సీ వర్గీకరణతో చిట్టచివరి దళితుడికి న్యాయం లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దళితుల్లో దాదాపు 60 శాతం మాదిగలు ఉన్నట్లు అంచనా వేస్తున్న కమలనాథులు, వారంతా తమకే మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1997లో వరంగల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో బంగారు లక్ష్మణ్‌ నాయకత్వంలో, వి. రామారావులు చొరవ తీసుకుని అందరికీ సమన్యాయం అన్న అంశంపై తీర్మానం చేశారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. అయితే ఎస్సీ వర్గీకరణపై తమ వాదనకు అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చినా, బీజేపీ అధికారికంగా ఎలాంటి స్పందనా వెల్లడించలేదు.


ఇది వ్యూహాత్మకం అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకే రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు ఎవరూ స్పందించలేదని సమాచారం. మాదిగలకు న్యాయం చేసే సమయంలో మాలలు దూరం కావొద్దన్న అభిప్రాయంతో జాతీయ నాయకత్వం ఉంది. అందుకే ఆచీతూచి స్పందించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం తీర్పు చారిత్రాత్మకమైందని బీజేపీ సీనియర్‌ నేత మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 03:32 AM