Share News

T. Harish Rao: దశ దిశలేని కాంగ్రెస్‌ పాలన..

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:42 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దశ దిశ లేని పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా.. ఒక విజన్‌, విషయం లేకుండాపోయిందని విమర్శించారు.

T. Harish Rao: దశ  దిశలేని కాంగ్రెస్‌ పాలన..

  • వాస్తవాల విస్మరణ.. అవాస్తవాల విస్తరణలా బడ్జెట్‌

  • ఆరు గ్యారెంటీలకు కేటాయింపులేవి?

  • రుణమాఫీపై పూటకో మాట చెబుతున్నారు

  • ఎక్సైజ్‌ ఆదాయం పెరగడానికి ఏం చేస్తారు?

  • భూముల అమ్మకంలో ద్వంద్వ వైఖరి: హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దశ దిశ లేని పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా.. ఒక విజన్‌, విషయం లేకుండాపోయిందని విమర్శించారు. ఎంతసేపూ బీఆర్‌ఎ్‌సను నిందించడమే పనిగా పెట్టుకున్నారని, తమ పేరు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతారని మండిపడ్డారు. శనివారం శాసన సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక ఆదాయ-వ్యయ పట్టికపై సాధారణ చర్చను బీఆర్‌ఎస్‌ తరపున హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ బీఆర్‌ఎ్‌సను తిట్టిపోసేలా, రాజకీయ కరపత్రంలా బడ్జెట్‌ ఉంది.


ఫార్ములేషన్‌ ఆఫ్‌ పాలసీ కన్నా హ్యుమిలియేషన్‌ మీదే దృష్టి పెట్టారు’’ అని విమర్శించారు. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే.. పదేళ్ల పాలన ఫలితంగా అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. రూ.4 లక్షలు లేని జీఎ్‌సడీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లామని, అన్ని రంగాలకు సరిపడా కరెంట్‌ ఇచ్చామని తెలిపారు. గతంలో సీఎం, మంత్రుల మీటింగ్‌ జరుగుతుంటే పోలీసులు రక్షణగా ఉండేవారని, కానీ.. ఇప్పుడు కరెంటు వాళ్లు జనరేటర్లతో కాపలా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక రూ.4 వేల పింఛన్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ నాలుకపై మాత్రమే ఉందని హరీశ్‌రావు అన్నారు. వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణలా బడ్జెట్‌ ఉందన్నారు. ‘‘2023-24లో కేంద్రం నుంచి రూ.9729 కోట్ల గ్రాంట్లు వస్తే.. ఈ బడ్జెట్‌లో రూ.21,636 కోట్లు పెట్టారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అదనంగా రూ.12 వేల కోట్లు ఏ విధంగా వస్తాయని పెట్టారు?’’అని ప్రశ్నించారు.


  • రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలు..

కాంగ్రెస్‌ ప్రభ్వు వైఖరి వల్ల రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయిందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాది రూ.14,295 కోట్లు వస్తే.. ఈ ఏడాది రూ.18,225 కోట్లు వస్తుందని పెట్టారు. ఎలా వస్తుంది? ఎక్సైజ్‌ ఆదాయం 2023-24లో రూ.19,784 కోట్లు వచ్చింది.. 2024-25లో రూ. 24వేల కోట్లు ఎక్సైజ్‌ ఆదాయం వస్తుందని చూపించారు. ఆ రోజు గ్రామానికో బెల్ట్‌షాపు పెట్టామని మీరే చెప్పారు. ఇప్పుడు గల్లీకో బెల్టు షాపు పెడతారా? రూ.24 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సాధిస్తామని బడ్జెట్‌లో పెట్టారు. అదనంగా రూ.14 వేల కోట్లను సమీకరిస్తామని చెప్పారు. గతంలో భూముల అమ్మకం వద్దని మీరే చెప్పారు. ఇదేం ద్వంద్వ వైఖరి?’’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 6,71,757 కోట్లు అప్పు చేసిందని పదే పదే అంటున్నారని, అయితే.. అప్పులు మాత్రమే కాకుండా తాము సృష్టించిన ఆస్తులు కూడా చూడాలని హరీశ్‌రావు అన్నారు. ‘‘ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పులు తీసేస్తే.. మిగిలే అప్పు రూ.5,16,881 కోట్లు మాత్రమే. రాష్ట్రం ఏర్పడే నాటికి వారసత్వంగా సంక్రమించిన అప్పు, తెలంగాణ ఏర్పడక ముందు ఎస్పీవీల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు.. అన్నీ తీసివేస్తే మేం చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమే. పైగా డిస్కమ్‌ల అప్పులు రూ.9 వేల కోట్లు అదనంగా పడ్డాయి. కానీ, తొమ్మిదినరేళ్ల కాలంలో రూ.లక్షల కోట్లు ఆస్తులను కూడా సమకూర్చామనే వాస్తవాలను గుర్తించాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.


  • అదనపు వనరుల సమీకరణలో గోప్యమెందుకు?

బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా ప్రభుత్వానికి అదనంగా పన్నేతర ఆదాయం రూ.11,389 కోట్లు ఏ విధంగా సాధ్యమవుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో పూటకో మాట చెప్పారని విమర్శించారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని చెప్పి.. 8 నెలల వడ్డీని రైతులే కట్టుకోవాలని చెప్పడం దుర్మార్గమన్నారు. బతుకమ్మ చీరలను కట్టుకోకుండా పంట పొలాల్లో కడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై మహిళలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-2 వాయిదా వేయాలని కోరిన వారిని సీఎం సన్నాసులు అని అన్నారని, తిరిగి ఎలా వాయిదా వేశారని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. తాము మాట్లాడేటప్పుడు టీవీ స్ర్కీన్‌లో చూపించడంలేదని ఆక్షేపించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. పదేళ్లు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, నెలనెలా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టామని, బడ్జెట్‌ను ప్రజలంతా హర్షిస్తుంటే హరీశ్‌రావుకు కంటగింపుగా మారిందని అన్నారు. బడ్జెట్‌ వినడానికి వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్‌.. సభకు వచ్చి మాట్లాడాల్సిందిపోయి రాకుండా బాధ్యత లేకుండా పోయారని విమర్శించారు. ఎక్సైజ్‌లో దొరికినంత దోచుకున్నారని, టానిక్‌ లాంటి షాపులు పెట్టి, వేలం ద్వారా కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమందికి వచ్చేలా చేశారని ఆరోపించారు.


  • కాంగ్రెస్‌ అంటేనే ధోకా పార్టీ

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే పెద్ద ధోకా పార్టీ అని హరీశ్‌రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో పలు ధోకాలు చేసిందని ఆరోపించారు. ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు రూ.53 వేల కోట్లు పెట్టి తాజా బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లకు తగ్గించారన్నారు. మహాలక్ష్మి పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకంలో అనేక ఆంక్షలు పెట్టారని విమర్శించారు. మొదట్లో వరి, పత్తి, పసుపు వంటి పంటలన్నింటికీ రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామన్నారని, కానీ ఇప్పుడు సన్న వడ్లకే అంటున్నారని తెలిపారు. బీసీలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని, కానీ.. ఈ బడ్జెట్‌లో రూ.9 వేల కోట్లు మాత్రమే పెట్టారని అన్నారు. రాష్ట్రంలో 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఊసే లేదని ధ్వజమెత్తారు. బడే భాయ్‌ (మోదీ) బాటలోనే.. చోటే భాయ్‌ (రేవంత్‌) నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ముస్లిం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేరని, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏల మాట లేదని విమర్శించారు.

Updated Date - Jul 28 , 2024 | 03:42 AM