Loans: పూచీకత్తు రుణాలపై గోప్యత!
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:41 AM
రుణాల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచీకత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలనూ బహిర్గతపర్చలేదని దుయ్యబట్టింది.
జీఎ్‌సడీపీలో రుణాలు 35.64 శాతం.. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు మించి అప్పులు
ఆర్థిక స్థితిగతుల నివేదికలో బీఆర్‌ఎస్ సర్కారు నిర్వాకాలను ఎండగట్టిన కాగ్
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రుణాల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచీకత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలనూ బహిర్గతపర్చలేదని దుయ్యబట్టింది. ఆయా సంస్థలకు తీసుకున్న బడ్జెటేతర రుణాల వివరాలను ఆడిట్‌కు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తింది. అంతేకాదు 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు మించి రుణాలు తీసుకుందని పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎ్‌సడీపీ)లో 29.7 శాతం మేరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండగా.. బీఆర్‌ఎస్ సర్కారు 35.64 శాతం అప్పులు చేసిందని ఆక్షేపించింది.
బడ్జెట్ నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయని.. కేటాయింపుల్లేకుండానే దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విమర్శించింది. ఇక బీఆర్‌ఎస్ సర్కారు తీసుకున్న పూచీకత్తు రుణాల్లో 90 శాతం సొమ్ములు ఐదు కార్పొరేషన్లకే అప్పగించిందని వివరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయక గ్రాంట్లను కూడా చాలా ఎక్కువగా అంచనా వేసిందని ఆరోపించింది. పన్నేతర రాబడి అంచనాలు కూడా చేరుకోలేకపోయిందని కాగ్ పేర్కొంది. 2021-23 మధ్య కాలంలో బీఆర్‌ఎస్ సర్కారు చేసిన అప్పుల్లో 80 నుంచి 84 శాతం మేర సొమ్ములు పాత రుణాల చెల్లింపులకే వెచ్చించిందని తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన విధానం కాదని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నివేదిక’లో కాగ్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకాలను ఎండగట్టింది. ఈ నివేదికను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది.
ఐదు సంస్థలకే 90 శాతం పూచీకత్తులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చిన పూచీకత్తుల్లో 90ు ఐదు సంస్థలదే భాగస్వామ్యమని తెలిపింది. కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.64,652 కోట్లు, పౌర సరఫరాల సంస్థకు 50 వేల కోట్లు, డిస్కంలకు 27,852 కోట్లు, మిషన్ భగీరథ కోసం పెట్టిన తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు 22,428 కోట్లు, నీటి వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు రూ.12,953 కోట్ల రుణాలకు పూచీకత్తులు ఇచ్చిందని వివరించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు రుణాల కోసం గ్యారెంటీలు ఇచ్చినా.. ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదని కాగ్ ఆరోపించింది. 2023 మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తుల రుణాలు మొత్తం రూ.1,18,629 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. డిస్కంల రుణాల్లో రూ.1600 కోట్లను తక్కువగా చూపిందని తెలిపింది. రుణ స్థిరీకరణ విశ్లేషణ ప్రకారం.. చెల్లించాల్సిన ప్రభుత్వ అప్పులు గత ఐదేళ్లలో 12 నుంచి 19 శాతానికి పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది.
బడ్జెట్ నిర్వహణలో లోపాలు..
బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఖర్చు చేయడం 2022-23లో కూడా కొనసాగిందని కాగ్ తెలిపింది. దాదాపు 48 ఉప పద్దుల కింద రూ.8,985 కోట్లు ఇలా ఖర్చు చేసిందని ఆక్షేపించింది. 2022-23లో పన్నేతర రాబడుల కింద రూ.25,422 కోట్లు వస్తాయని గత ప్రభుత్వం అంచనా వేయగా.. రూ.19,554 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించింది. పన్నేతరాల కింద భూములు, ఆస్తుల విక్రయం ద్వారా రూ.15,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. రూ.791 కోట్లే వచ్చాయని వెల్లడించింది. గత మూడేళ్లలో పన్నేతర రాబడుల అంచనాలు ఎక్కువగా ఉంటున్నాయని, లక్ష్యాలను చేరుకోవడం లేదని తెలిపింది.
గ్రాంట్లను ఎక్కువగా చూపారు
కేంద్రం నుంచి వచ్చే సహాయక గ్రాంట్లను ఎక్కువ అంచనా వేసి చూపారని ఆక్షేపించింది. 2022-23లో ఈ గ్రాంట్ల కింద ఏకంగా రూ.41,002 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.13,179 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపింది. గత ప్రభుత్వం ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి బడ్జెట్‌లో కేటాయించిన మేర నిధులను ఖర్చు చేయలేదని కాగ్ పేర్కొంది. ఈ పథకానికి రూ.11 వేల కోట్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు కేటాయించిన రూ.1000 కోట్లు, ఆయిల్‌పామ్ పెంపకానికి కేటాయించిన రూ.1000 కోట్ల నిధులను సంపూర్ణంగా ఖర్చు చేయలేదని తెలిపింది. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించినప్పటికీ రూ.15,700 కోట్లు ఖర్చవలేదని, రైతు రుణమాఫీ కింద రూ.3,964 కోట్లను వ్యయం చేయలేదని వివరించింది.
పెరిగిన జీఎ్‌సడీపీ
రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎ్‌సడీపీ) వృద్ధి చెందినట్లు కాగ్ తెలిపింది. 2018-19లో రూ.8,57,427 కోట్లు ఉండగా.. 2022-23లో రూ.13,13,391 కోట్లకు పెరిగిందని.. ఇది 15.09ు వృద్ధి అని వెల్లడించింది. రాష్ట్ర సొంత పన్ను రాబడి కొవిడ్ కారణంగా 2020-21లో స్వల్పంగా తగ్గినా.. 2021-22లో గణనీయంగా పెరిగింది. 2022-23లో కూడా వృద్ధి కొనసాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ సర్కారు అంచనా వేసినదాని కంటే రెవెన్యూ మిగులు చాలా తక్కువగా ఉందని కాగ్ ఆక్షేపించింది.
సరిపడా ఆస్పత్రులు, వైద్యులేరి?
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనాభాకు సరిపడా ప్రభుత్వాస్పత్రులు లేవని.. ఉన్న చోట్ల వైద్యులూ లేరని.. అవసరమైన స్థాయిలో పడకలూ లేవని కాగ్ (కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్) తీవ్రంగా ఆక్షేపించింది. తెలంగాణలో ఆస్పత్రులు, వైద్యుల కొరత తీవ్రంగా ఉందని.. ఒకస్థాయి ఆస్పత్రుల్లోనూ 45ు, మరో స్థాయి ఆస్పత్రుల్లో 56ు ఖాళీలున్నాయని పేర్కొంది. ప్రజావసరాలకు అనుగుణంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉప కేంద్రాలు (సబ్‌సెంటర్స్) లేవని వెల్లడించింది. సీహెచ్‌సీలు 69ు, పీహెచ్‌సీలు 25ు, ఉప కేంద్రాలు 29ు కొరతతో ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణలో ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవల నిర్వహణపై 2016-17 నుంచి 2021-22 మార్చితో ముగిసిన ఏడాదికి కాగ్ ఆడిట్ సమీక్ష నిర్వహించి, నివేదికను విడుదల చేసింది.
జనగాం, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో సీహెచ్‌సీలే లేవని, చాలా జిల్లాల్లో పీహెచ్‌సీలు, సబ్ సెంటర్స్ సంఖ్య నిబంధనల మేరకు తగినన్ని లేవని తేల్చి చెప్పింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 35,004 పడకలు అవసరమైతే సర్కారు దవాఖానాల్లో కేవలం 27,996 ఉన్నాయని, 7,008 పడకల కొరత ఉన్నట్లు పేర్కొంది. ఆదిలాబాద్, హైదరాబాద్, హన్మకొండ జిల్లాల మినహా మిగతా అన్నింటా పడకల కొరత ఉన్నట్లు వెల్లడించింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ నిబంధన ప్రకారం చూస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45 శాతం ఖాళీలున్నాయి. మంజూరైన పోస్టులు, పనిజేస్తున్న సిబ్బంది మధ్యన భారీ తేడాలున్నాయి. వైద్యవిధాన పరిషత్తులో 10,822 పోస్టులు మంజూరుకాగా, 6196 మందే ఉన్నారు. ఎల్టీ పోస్టులు 391 మంజూరు కాగా, 181 మందే ఉన్నారు. ఆయుష్ విభాగంలో 2691 మంజూరు కాగా 1311 మందే ఉన్నారు. అంటే 51 శాతం ఖాళీలున్నాయి. ఇక జిల్లా ఆస్పత్రుల్లో 1524 పోస్టులు మంజూరు అవ్వగా 696 ఖాళీలున్నాయి. వైద్యుల కేడర్‌లో 801 పోస్టులకు గాను 419 మంది, నర్సింగ్‌లో 638 పోస్టులకు 241 మంది నర్స్‌లే ఉన్నారు. మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత చాలా తీవ్రంగా ఉంది. తనిఖీలు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్ కేడర్‌లో 48శాతం, అసిస్టెంట్‌లో 40 శాతం ఖాళీలున్నట్లు కాగ్ రిపోర్టులో వెల్లడైంది.
కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు
గడువు ముగిసిన మందులను గుర్తించకపోవడంతో ప్రభుత్వానికి రూ.390 కోట్ల నష్టం వాటిల్లింది.
ఉస్మానియా ఆస్పత్రిలో అకడమిక్ భవనాన్ని నిర్మించి 2016 అక్టోబరులో అప్పగించినా పరికరాలు, ఫర్నీచర్ లేని కారణంగా వాడుకలోకి తీసుకురాకపోవడంతో 17.35కోట్లు వృథా అయ్యాయి.
14 జిల్లా ఆస్పత్రుల్లో చెవి, ముక్కు, గొంతు, అన్నవాహిక, కడుపు, పెద్దపేగు, బ్రోంకోస్కోపి, ఆర్ర్థోస్కోపీ,హిస్టెరోస్కోపీకి సంబంధించిన రోగ నిర్థారణ పరీక్షలు అందుబాటులో లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య, జనాభా, అంటువ్యాఽధి తార్కికమైన సర్వేలను నిర్వహించలేదు.
నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోగ్య రంగానికి 8 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. కానీ 2016-22 మధ్య కాలంలో 2.53 నుంచి 3.47 శాతం మధ్య ఉంది.
రాష్ట్రంలో సీజేరియన్ ప్రసవాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. 2017-2022 మధ్య కాలంలో సీ సెక్షన్ 56 నుంచి 62 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీ సెక్షన్ రేటు 60 శాతం నుంచి 39 శాతానికి తగ్గగా... ప్రైవేటులో అది 40 నుంచి 61 శాతానికి పెరిగింది.
ఐటీసీ పేరిట ఖజానాకు కన్నం!
2017-18లో రూ.49.24 కోట్ల నష్టం
కాగ్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో కొందరు ఘనులు ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు. రూ.1,000 కోట్ల మేర ఐటీసీ కుంభకోణం జరిగినట్టు తాజాగా వాణిజ్య పన్నుల శాఖ గుర్తించగా.. గతంలో కూడా కొందరు ఐటీసీని అక్రమంగా పొంది ఖజానాకు నష్టం కలిగించినట్టు కాగ్ వెల్లడించింది. వస్తు మార్పిడి సందర్భంగా డీలర్లు క్లెయిమ్ చేసిన ఐటీసీతో సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. 2017-18లోనే రూ.49.24 కోట్ల ఐటీసీని అక్రమంగా క్లెయిమ్ చేసుకున్నట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఆ ఏడాది 50 మంది పన్ను చెల్లింపుదారుల (వస్తువుల గ్రహీతలు) రిటర్నులను పరిశీలించగా అందులో 30 మంది పన్ను చెల్లింపుదారులు వాడుకున్న ఐటీసీలో రూ.49.24 కోట్లను ప్రభుత్వ ఖజానా నష్టపోయినట్లు తేలిందని పేర్కొంది.
ఉదాహరణకు.. బేగంపేట స్టేట్ ట్యాక్స్ యూనిట్(ఎ్‌సటీయూ) పరిధిలోని కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ 2017-18లో రూ.24.05 కోట్ల ఐటీసీని క్లెయిమ్ చేసిందని, ఇందులో రూ.4.91 కోట్ల ఐటీసీ వివరాలు సక్రమంగా లేవని తెలిపింది. అలాగే పంజాగుట్ట ఎస్‌టీయూ పరిధిలోని లలిత జువెలరీ మార్ట్ రూ.56.61 కోట్ల ఐటీసీని క్లెయిమ్ చేయగా.. ఇందులో వాస్తవానికంటే రూ.15.39 కోట్లు అధికంగా తీసుకున్నట్లు పేర్కొంది. ఇక వ్యాట్ వసూళ్లలోనూ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు కాగ్ ఆక్షేపించింది. 2017-18కు సంబంధించి 18 మంది డీలర్ల టర్నోవర్లు, పన్ను అసె్‌సమెంట్లు, వసూళ్లను పరిశీలించగా.. మొత్తం 54.31 కోట్ల టర్నోవర్‌పై తక్కువ పన్నును విధించినట్టు పేర్కొంది. 12 మంది డీలర్ల నుంచి 14.5ు చొప్పున వ్యాట్‌ను వసూలు చేయాల్సి ఉండగా.. 5ు చొప్పున వసూలు చేసినట్లు గుర్తించింది. తక్కువ పన్ను విధించడంతో ఖజానాకు రూ.5.10 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.