Kishan Reddy: ఆర్ఆర్ఆర్ భూ సేకరణపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
ABN , Publish Date - Jan 24 , 2024 | 04:13 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆ లేఖలో కోరారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆ లేఖలో కోరారు. భారతమాల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే జాతీయ రహదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఎన్‌హెచ్‌ఏఐ)కి 50 శాతం నిధులు జమ చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఇవే అంశాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశామని వివరించారు. అప్పటి ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
వివాదం ఏంటంటే..?
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల రెండు భాగాలుగా 347.84 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాల్సి ఉంది. ఫస్ట్ ఫేజ్ కింద 158.64 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా ప్రకటించింది. 70 శాతానికి పైగా భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని గతంలో ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. రహదారి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. యుటిలిటీస్ (రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అడ్డంగా వచ్చే కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, టెలికం లైన్లను తొలగించడం) తరలింపు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. రహదారి నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. దీనిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. యుటిలిటీస్ తరలింపు వ్యయం భరించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లేఖ పంపించింది. దీంతో భూ సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో భూ సేకరణ అంశంపై కదలిక వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.