Bandi Sanjay: ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను చేర్చుకోం..
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:48 AM
ఈడీ, సీబీఐ కేసులున్న నాయకులను బీజేపీలోకి తీసుకునే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు బీజేపీకి సంబంధం లేదని, నరేంద్ర మోదీ సర్కారు అవినీతిపరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.
అవినీతిపరులను మోదీ సర్కారు ఉపేక్షించదు
పార్టీ అధ్యక్ష మార్పు హైకమాండ్ పరిధిలో: సంజయ్
కరీంనగర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈడీ, సీబీఐ కేసులున్న నాయకులను బీజేపీలోకి తీసుకునే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు బీజేపీకి సంబంధం లేదని, నరేంద్ర మోదీ సర్కారు అవినీతిపరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లోలాగా రాజీనామా చేయకుండా బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ‘విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో ఉన్నారు. ఇది మంచి పరిణామం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం విభజన అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలున్నా రాజకీయ లబ్ధి కోసం సమస్యలను జఠిలం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్ష మార్పు, కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశం పూర్తిగా పార్టీ హైకమాండ్ పరిధిలో ఉంటుందని సంజయ్ స్పష్టం చేశారు. ‘రామాయణ్ సర్క్యూట్ కింద ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశముంది. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతాం. ప్రతిపాదనలు పంపించాలని గత ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారు. కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగింది. రైల్వే లైన్ పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కేంద్రం స్మార్ట్ సిటీ గడువు పొడిగించిందని.. సీఎం రేవంత్ అడిగారని మాత్రం కాదని వివరించారు.