Godavari-Kaveri: సగం నీళ్లు కేటాయించలేం!
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:37 AM
గోదావరి-కావేరీ అనుసంధానం తొలి దశ కింద తరలించే నీటిలో 50 శాతాన్ని(74 టీఎంసీలను) కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది.
గోదావరి-కావేరీ అనుసంధానం తొలి దశలో 74 టీఎంసీలు ఇవ్వలేం
రెండో దశలోనే నీటి లభ్యత ఉంది
తెలంగాణకు ఎన్‌డబ్ల్యూడీఏ లేఖ
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరీ అనుసంధానం తొలి దశ కింద తరలించే నీటిలో 50 శాతాన్ని(74 టీఎంసీలను) కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. గోదావరి-కావేరీ అనుసంధానం(జీసీ లింక్)లో ఛత్తీ్‌సగఢ్ వినియోగించుకోని వాటా నుంచి 145 టీఎంసీలను మాత్రమే తరలిస్తున్నామని, ఇది కూడా ప్రతిపాదన దశలోనే ఉందని గుర్తు చేసింది. తొలి దశలో మిగులు జలాల్లేవని, రెండో దశలో హిమాలయన్, మహానది కాంపొనెంట్ నుంచి నీటి లభ్యత ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ఇటీవల తెలంగాణకు లేఖ రాసింది. ఇటీవల నిర్వహించిన పలు సమావేశాల్లో తెలంగాణ లేవనెత్తిన అంశాలకు ఎన్‌డబ్ల్యూడీఏ బదులిచ్చింది. గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టదల్చుకుంటే... సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ కింద ఉన్న 152టీఎంసీల వినియోగానికి రక్షణ కల్పించాలని, బ్యారేజీలో 83 మీటర్ల నుంచి 87 మీటర్ల మధ్య నిల్వ చేసిన నీటినే తరలించాలన్న తెలంగాణ డిమాండ్ చేయగా... బ్యారేజీ వద్ద, దిగువన తెలంగాణ వినియోగానికి ఎలాంటి నష్టం ఉండదని ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది, సమ్మక్కసాగర్ నుంచి గోదావరి-కావేరీ అనుసంధానానికి 78శాతం సక్సెస్ రేటు ఉందని, తెలంగాణ వినియోగానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని గుర్తు చేసింది.
అనుసంధానంలో తమ వాటాను వినియోగించుకోవడానికి వీలుగా గొట్టిముక్కల వద్ద రెండు రిజర్వాయర్లు కట్టాలని తెలంగాణ ప్రతిపాదించగా... తదుపరి అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఆపరేషనల్ ప్రొటోకాల్ తేల్చే దాకా నాగార్జునసాగర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోరాదన్న తెలంగాణ ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఆ అంశం ప్రతిపాదనల దశలోనే ఉందని, ట్రైబ్యునల్ తీర్పు కు లోబడే తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి-కావేరీ నీటిని ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి తరలించడానికి(వాడుకోవడానికి) వెసులుబాటు కల్పించడం వల్ల దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేయగా... జూలై నుంచి అక్టోబరు వరకే ఈ నీటిని తరలించే అవకాశం ఉంటుందని కేంద్రం గుర్తు చేసింది.
బ్యారేజీపై కొనసాగుతున్న డైలమా
గోదావరి-కావేరీ అనుసంధానం కోసం ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి, అక్కడి నుంచే నీటిని తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించగా... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి 24 కిలోమీటర్ల దిగువలోనే తుపాకులగూడెం బ్యారేజీ ఉందని, ఆకస్మికంగా వరదలు వస్తే నియంత్రించడం కష్టమని స్పష్టం చేసింది. తుపాకులగూడెం బ్యారేజీ నుంచి అనుసంధానం చేపడితే అభ్యంతరాల్లేవని పేర్కొంది. ఇదే అంశాన్ని ఇటీవల తెలంగాణ నీటిపారుదల అధికారులు తేల్చిచెప్పారు. వాస్తవానికి ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే... బ్యాక్‌వాటర్ నుంచి 165 టీఎంసీలను కాళేశ్వరం ప్రాజెక్టు కింద తరలించడానికి సమ్మతి తెలుపుతామని గతంలోనే కేంద్రం ఆఫర్ ఇచ్చింది. తాజాగా కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంతో ఈ ఆఫర్‌పై చర్చ జరుగుతోంది.