Share News

Budget Allocation: ఇంటికి నిధులు.. అందరికీ అందేనా!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:34 AM

ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరేలా కనిపించడంలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. చెప్పిన ఇళ్లకు అవి సరిపోయే పరిస్థితి లేదు.

Budget Allocation: ఇంటికి నిధులు.. అందరికీ అందేనా!

  • ఇందిరమ్మ ఇళ్లకు 9,184 కోట్లు

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరేలా కనిపించడంలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. చెప్పిన ఇళ్లకు అవి సరిపోయే పరిస్థితి లేదు. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం హౌసింగ్‌ శాఖకు రూ.9,184 కోట్లు కేటాయించింది. ఇందులోనే కేంద్రం అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌, రూరల్‌) పథకాల కింద రూ.3,500 కోట్లకుపైగా కేంద్ర ప్రాయోజిత నిధులు కూడా అందుతాయని పేర్కొంది. మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,16,500 ఇళ్లను నిర్మించాలని, రిజర్వ్‌ కోటాలో మరో 33,500 ఇళ్లు కలిపి 4,50,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. అయితే, తాజా బడ్జెట్‌లో మొత్తం ఇళ్ల నిర్మాణాలకయ్యే నిధుల్లో 40శాతమే కేటాయించింది. రూ.9,184 కోట్లతో (ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున) రాష్ట్రవ్యాప్తంగా 1,83,680 ఇళ్ల నిర్మాణానికి సాయం అందనుంది. అంటే ఒక్కో నియోజకవర్గానికి 1,543 ఇళ్లకే అందనుంది. మరోవైపు ఈ నిఽధులనుంచే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లలో మరమ్మతుల కోసం రూ.650-1,000కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా. ఇవి పోగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మిగిలేది రూ.8,184 కోట్లేన ని తెలుస్తోంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆశించిన స్థాయిలో ముందుకెళుతుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పోలీసు శాఖకు 9564 కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌లో హోం శాఖకు నిధుల కేటాయుయింపు స్వల్పంగా తగ్గింది. గత బడ్జెట్‌లో రూ.9,599కోట్ల కేటాయింపులు జరగ్గా.. ఈ సారి రూ.9,564కోట్లను ప్రకటించారు. శాఖాధిపతికి రూ.374.48కోట్లు, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రూ.276.44కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌కు రూ.20కోట్లు కేటాయించారు. నిఘా విభాగానికి రూ.108.7 కోట్లకు పెంచారు. తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌)కు గతంలో రూ.8.5 కోట్లు ఇవ్వగా.. ఈ సారి రూ.20కోట్లకు పెంచారు. సైబర్‌ నేరాల కట్టడికి ఏర్పాటైన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ)కి బడ్జెట్‌లో తొలిసారి రూ.15 కోట్లను కేటాయించారు.

Updated Date - Jul 26 , 2024 | 03:34 AM