CM Revanth Reddy: నో బెనిఫిట్!
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:40 AM
ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. అసెంబ్లీలో ఈమేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు తేల్చిచెప్పారు.
ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించం
నాకు ఎవరిపైనా ఇష్టాయిష్టాల్లేవ్
సీఎంగా చట్టాన్ని అమలు చేస్తా సీఎం రేవంత్
అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా.. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం.. పద్ధతిగా ఉండండి
సీఎం పేరు చెప్పనందుకే కేసు అని ప్రచారం చేస్తారా?.. ఎప్పుడో ఆ స్థాయి దాటాం.. మీరెందుకు ఖండించలే?
బౌన్సర్లు పోలీసులను అడ్డుకుంటే వారితోపాటు సెలబ్రిటీలపైనా కేసులు.. అభిమానులనూ మీరే నియంత్రించాలి
సామాజిక బాధ్యతను సినీ పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలి.. డ్రగ్స్, గంజాయి నిరోధానికి ప్రచారం చేయాలి
పర్యావరణం, ఆలయ పర్యాటక ప్రచార బాధ్యతా మీదే.. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం
టాలీవుడ్ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి.. గురుకులాలకు సినీపరిశ్రమ నుంచి సెస్ వసూలు యోచన: భట్టి
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. అసెంబ్లీలో ఈమేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు తేల్చిచెప్పారు. అయితే.. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, పరిశ్రమ కూడా సామాజిక బాధ్యత నిర్వర్తించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ కేసు విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. బన్నీ తన పేరును మర్చిపోవడం వల్ల కేసు పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేశారని, తాను ఆ స్థాయిని ఎప్పుడో దాటివచ్చేశానని పేర్కొన్నారు. ‘ఆ తప్పుడు ప్రచారాన్ని మీరెందుకు ఖండించలేదు?’ అని ఇండస్ట్రీ పెద్దలను రేవంత్ సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తున్నామని.. పరిశ్రమ తరఫున కూడా ఒక కమిటీని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఫిలిం డెవల్‌పమెంట్ కార్పోరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో పలువురు సినిమా ప్రముఖులు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉన్నారు. పరిశ్రమ సమస్యలతోపాటు పలు అంశాలపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను రేవంత్‌కు తెలిపారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి.. తమ ప్రభుత్వం పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సినిమా స్టూడియోలకు స్థలాలు, పరిశ్రమవారికి నివాస స్థలాలు, ఫిల్మ్‌నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలను గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే అందించాయని గుర్తుచేశారు. అదే సహకారాన్ని, ఆ వారసత్వాన్ని తాము కూడా కొనసాగిస్తామని భరోసానిచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఐటీ, ఫార్మా రంగాలు ఎంత ముఖ్యమో.. సినీ రంగం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి ‘గద్దర్’ పేరిట అవార్డులను ఇచ్చేలా కొత్త ఒరవడిని తీసుకొచ్చామని.. ప్రభుత్వానికి, పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్‌రాజును ఫిలిం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించామని గుర్తుచేశారు.
దేశంలోని కాస్మోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఉత్తమమైనదని.. ఇక నుంచి హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు కూడా హైదరాబాద్‌కు వచ్చేలా చర్యలు చేపడుతామని చెప్పారు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటుచేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని.. గంజాయి, డ్రగ్స్ నిరోధంతో పాటు సామాజిక అంశాలపైనా సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు. ‘‘సినిమా వాళ్లు ఫంక్షన్లు చేసుకోవచ్చు మాకు ఏమీ అభ్యంతరం లేదు, అన్ని అనుమతులూ ఇస్తాం. కానీ అభిమానులను నియంత్రించే వ్యవహారాన్ని నిర్వాహకులు, సెలబ్రిటీలే చూసుకోవాలి. బౌన్సర్లు పోలీసు అధికారులనే అడ్డుకుంటున్నారు. దానిని ఎట్టి పరిస్థితుల్లో సహించం. అలా అడ్డుకుంటే బౌన్సర్లతో పాటు.. సెలబ్రిటీలపైనా కేసులు పెడతాం’’ అని కూడా సీఎం అన్నట్టు సమాచారం.
అది నా బాధ్యత
సినీ పరిశ్రమ అభివృద్ధికి మొదటి తరంలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్), మర్రి చెన్నారెడ్డి, రెండో తరంలో చంద్రబాబు, వైఎస్ సహకరించారని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు మూడో తరంలో ఉన్న తమ ప్రభుత్వం కూడా అదే సహకారాన్ని అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల సంక్షేమానికి ప్రభాకర్‌రెడ్డి చేసిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. ఇండస్ట్రీలో చిరంజీవి కష్టపడి కిందిస్థాయి నుంచి ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరారని, తాను కూడా కిందిస్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగానని అన్నారు. ఎవరి లక్ష్యాలు, గమ్యాలు వారికి ఉన్నాయు కాబట్టే ఇక్కడవరకు చేరుకోగలిగామని, ఎవరి స్టైల్ వారికి ఉంటుందని వ్యాఖ్యానించారు. సినిమా వారికి రాజకీయాలతో సంబంధంలేదని, ఆ సంగతి తాము చూసుకుంటామని సీఎం ఒక దశలో కొంత ఘాటుగా చెప్పినట్టు తెలిసింది. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత తనపై ఉందని.. అందరినీ సమానంగా చూడడమే తప్ప, ఎవరిపైనా తనకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని ఈ భేటీలో ఆయన స్పష్టం చేశారు. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణానికీ ఇక్కడ అవకాశం ఉండేలా అందరం కలిసి అభివృద్ధి చేద్దామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సినీ పరిశ్రమకు పిలుపునిచ్చారు.
ఆ ప్రచారానికి ఆస్కారం ఇవ్వొద్దు
అల్లు అర్జున్, రామ్‌చరణ్, రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని.. ఇప్పుడు సూపర్‌స్టార్లుగా ఎదిగిన ఆ ముగ్గుర్నీ చూస్తుంటే సంతోషంతోపాటు గర్వంగా కూడా ఉందని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 8 సినిమాలకు ప్రత్యేక జీవోలు ఇచ్చిందని, ‘పుష్ప’ సినిమాకు పోలీసు భద్రత ఇచ్చామని గుర్తుచేశారు. అయినా.. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్యదూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోందని.. అలాంటి ప్రచారానికి ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. ఇలాంటి ప్రచారం వల్ల ప్రభుత్వానికంటే పరిశ్రమకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాగా.. సినిమాలకు పెద్దగా లాభాలు లేకపోయినా నిర్మాతలు ఇండస్ట్రీపై ప్రేమతో చిత్రాలు తీస్తున్నారని, రాష్ట్రంలో 300కు పైగా సింగిల్ థియేటర్లు మూతపడ్డాయని సినీ ప్రముఖులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సమీకృత గురుకులాలకు పరిశ్రమ నుంచి సెస్: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు సినీ పరిశ్రమ నుంచి కొంత సుంకాన్ని తీసుకోవాలనే యోచనలో ఉన్నామని, ఇందుకు పరిశ్రమ సహకరించాలని.. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై పరిశ్రమ ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ‘రైజింగ్ తెలంగాణ’ నినాదంతో ముందుకెళ్తోందన్న భట్టి.. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటుచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సినీపరిశ్రమకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనేనని.. ఆ కోవలోనే తమ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తెలిపారు.
సినిమాటోగ్రఫీ వద్దు అన్నా: మంత్రి కోమటిరెడ్డి
ప్రభుత్వం సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ఉందని.. వేరే ఉద్దేశాలేవీ లేవని ఈ భేటీలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ కూర్పులో భాగంగా తనకు ఆర్ అండ్ బీతో పాటు సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తున్నట్టు సీఎం రేవంత్ చెప్పినప్పుడు.. తనకు సినిమాటోగ్రఫీ వద్దని చెప్పానని, వీలైతే క్రీడల శాఖను ఇవ్వాలని కోరాన ని.. కానీ అది సాధ్యపడలేదని చెప్పి సమావేశంలో ఆయన నవ్వులు పూయించారు.
తేడా వస్తే కేసులే: డీజీపీ జితేందర్
సినిమా వాళ్లు నిర్వహించుకునే ఫంక్షన్లకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. అయితే బౌన్సర్ల సంస్కృతి సరైంది కాదని అయన అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి బౌన్సర్లు పోలీసులను కూడా నిలువరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తేడా వస్తే బౌన్సర్లపైనే కాక నిర్వాహకులపైనా కేసులు, చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు.
పెద్ద మనసు చేసుకోవాలి
వేల కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు.. కాబట్టి, పెద్ద సినిమాల విషయంలో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. మొదటి వారం కొంచెం వెసులుబాటు కల్పించాలి. సంధ్య థియేటర్ దగ్గర చోటుచేసుకున్న ఘటన ఎంతగానో కలచివేసింది.
- మురళీమోహన్, నిర్మాత
మళ్లీ జరగకుండా చూసుకుంటాం
‘పుష్ప-2’ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర అనుకోని ఘటన జరిగింది. అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సినిమాలకు హైదరాబాద్ వాతావరణం బాగుంటుంది. ముంభై నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు. దీన్ని మరింత బలోపేతం చేసేలా చూస్తాం.
- అల్లు అరవింద్, నిర్మాత
స్టూడియోల్లో పెద్దగా లాభాలు లేవు
నిర్మాతలు బాగుంటేనే మేం బాగుంటాం. స్టూడియోల్లో పెద్దగా లాభాలు రావట్లేదు. అక్కినేని నాగేశ్వరరావు హయాంలో ఇక్కడ స్టూడియోలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ప్రపంచ సినిమా రంగానికి హైదరాబాద్ రాజధాని కావాలనేదే మా కోరిక.
- నాగార్జున, నటుడు
బాలల చిత్రోత్సవం నిర్వహించాలి
తెలంగాణలో సినిమా చిత్రీకరణకు అవకాశాలు బాగున్నాయి. గత సీఎంలందరూ పరిశ్రమను బాగా చూసుకున్నారు. ప్రస్తుత సర్కారూ మాకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏటా బాలల చిత్రోత్సవాన్ని నిర్వహించాలని కోరుతున్నాం.
- రాఘవేంద్రరావు, దర్శకుడు
అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌కు కేరా్‌ఫగా మారాలి
సినీపరిశ్రమ.. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటోంది. గత ప్రభుత్వాల సహాయంతోనే అప్పట్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయిలో చిత్రాలకు గమ్యస్థానంగా చేయాలన్నదే మా లక్ష్యం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి చాలా ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ చిరునామాగా మారాలి.
- డి.సురే్‌షబాబు, నిర్మాత
మరింత బలోపేతం అవుతాం..
మాజీసీఎం మర్రి చెన్నారెడ్డి సహా ఆ సమయంలో ఎంతో మంది అందించిన సహకారం వలనే చెన్నై నుంచి సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చింది. ఇక్కడ అవకాశాలు బాగున్నాయి. బాలీవుడ్ వాళ్లు కూడా వస్తున్నారు. పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తాం.
- త్రివిక్రమ్, దర్శకుడు