Share News

Land issues: ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం..

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:02 AM

ధరణితో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్దేశించారు.

Land issues: ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం..

  • పైలట్‌ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని తీసుకోండి

  • ధరణిపై సమీక్షలో రేవంత్‌ రెడ్డి

  • అందుకు మరింత లోతుగా అధ్యయనం చేయండి.. పైలట్‌ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని తీసుకోండి

  • ప్రజల నుంచి సూచనలు స్వీకరించండి.. భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం చేయాలి

  • విస్తృత సంప్రదింపులు, అఖిలపక్ష భేటీ తర్వాతే నిర్ణయం.. ధరణిపై సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ధరణితో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మరింత లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్దేశించారు. భూ సమస్యలు నానాటికీ ఎక్కువవుతున్న నేపథ్యంలో సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉందని స్పష్టం చేశారు. ధరణి సమస్యలపై శుక్రవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా మండల కేంద్రానికి, తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయి. భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం గతంలో ఉండేది. ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండాపోయింది.


సమస్త అధికారాలను జిల్లా కలెక్టర్‌కే అప్పజెప్పారు. అయినా.. అక్కడ కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. కలెక్టర్లు తీసుకునే ఏ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారు’’ అని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. భూదాన్‌, పోరంబోకు, బంచరాయి, ఈనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని ఎంపిక చేసుకొని, అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తే ఆయా సమస్యలపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.


అవసరమైతే వాటిపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ధరణి సమస్యల పరిష్కారానికి ఆర్వోఆర్‌ చట్టంలో తీసుకు రావాల్సిన మార్పులపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ కూడా ఇచ్చారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌ కుమార్‌, రేమండ్‌ పీటర్‌, మధుసూదన్‌, సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శులు వేముల శ్రీనివాసులు, సంగీత సత్యనారాయణ, అజిత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 03:02 AM