Share News

Kishan Reddy: రేవంత్‌.. హిందూ వ్యతిరేకి

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:00 AM

ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హిందూ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: రేవంత్‌.. హిందూ వ్యతిరేకి

  • హిందువుల తలలు పగలగొడతారా

  • ఇది కాంగ్రెస్‌ దురహంకారానికి నిదర్శనం

  • పరీక్షలూ సక్రమంగా పెట్టలేరా..?: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/కుషాయిగూడ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హిందూ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడికి నిరసనగా హిందూ సంఘాలు ఆందోళన చేస్తే.. వారిపై పోలీసుల చేత ఎందుకు పాశవిక దాడికి ఆదేశించారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లాఠీచార్జ్‌లో వందలాది మంది కార్యకర్తలు తలలు పగిలాయని.. చేతులు, కాళ్లు విరిగాయని మండిపడ్డారు. ఆలయంపై దాడి జరిగితే నిరసన తెలిపే హక్కు లేదా? అని నిలదీశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.


ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాలపై పోలీసుల దమనకాండ, అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీచార్జ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పూర్తి హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. వినాయకచవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేకమందిపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. కొన్ని ప్రార్థనా కేంద్రాల్లో ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఓట్ల కోసం రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలు అశోక్‌నగర్‌ లైబ్రరీకి వెళ్లి కాకమ్మ కబుర్లు చెప్పారని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన తప్పులే కాంగ్రెస్‌ హయాంలోనూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. జీవో 29 విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.


  • చర్లపల్లి స్టేషన్‌ సందర్శన..

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను త్వరలోనే ప్రారంభిస్తామ కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. స్టేషన్‌ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రధానంగా కనెక్టివిటీ, అప్రోచ్‌ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉందని, ఈ విషయమై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. కాగా, చర్లపల్లి రైల్వే టర్మినల్‌ ఉత్తరం వైపు రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ మహాలక్ష్మినగర్‌ కాలనీ మహిళలు కిషన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. రోడ్డు విస్తరణతో తాము ఇళ్లను కోల్పోతామని.. ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విన్నవించారు.


  • రాహుల్‌.. అబద్ధాల మిషన్‌: లాల్‌సింగ్‌ ఆర్య

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. అబద్ధాల మిషన్‌ అని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య విమర్శించారు. రిజర్వేషన్లు, రాజ్యాంగంపై ఆయన లోక్‌సభ ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధాలు ప్రచారం చేయడం వల్లనే జమ్మూ కశ్మీర్‌, హరియాణాల్లో కాంగ్రెస్‌, ఓటమి పాలైందన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 04:00 AM