Share News

CM Revanth Reddy: ప్రభుత్వం కూలుతుందన్న వాళ్లు.. ఇప్పుడు ఎక్కడ?

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:04 AM

‘‘ప్రభుత్వాన్ని పడగొడతామని అచ్చోసిన ఆంబోతుల్లా బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్లు అంటే.. మేం నిలబెడతామని ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నరు. తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సర్కారుకు అండగా ఉంటామంటున్నరు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ప్రభుత్వం కూలుతుందన్న వాళ్లు.. ఇప్పుడు ఎక్కడ?

  • వాళ్లు పడగొడతామంటే.. ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు!

  • తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నారు

  • ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల కాగితమే కనిపిస్తోంది

  • ప్రతి నెలా వడ్డీలే రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది

  • మహేశ్వరాన్ని మరో న్యూయార్క్‌లాగా అభివృద్ధి చేస్తాం

  • చదువు ద్వారా బలహీనవర్గాలు పాలకులుగా ఎదగాలి

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే

  • ఎంపీలు, ఎమ్మెల్యేల ఉద్యోగాలు ఉండవు

  • హయత్‌నగర్‌ వరకు మెట్రో రైలు విస్తరణ: సీఎం రేవంత్‌

  • గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాల పంపిణీ

హైదరాబాద్‌ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వాన్ని పడగొడతామని అచ్చోసిన ఆంబోతుల్లా బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్లు అంటే.. మేం నిలబెడతామని ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నరు. తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సర్కారుకు అండగా ఉంటామంటున్నరు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సర్కారు పనయిపోయిందని, కూలిపోతుందని అన్నవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారని, రోజులు లెక్కపెట్టుకుంటున్నది ఎవరని ప్రశ్నించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు ‘కాటమయ్య రక్షక కవచం’ కిట్లను పంపిణీ చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘మూడు నెలలు, ఆరు నెలలు కాదు.


ఈ ప్రభుత్వం పదేళ్లు ఉంటది. 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్‌ అందించిన జనరంజక పాలనను మరోసారి అందిస్తుంది. ఓడినోళ్లు, ఇంట్లో పడుకున్నోళ్లు, ఫామ్‌హౌ్‌సలో ఉంటున్నోళ్లను అడుగుతున్నా.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? అవన్నీ తెచ్చినందుకే హైదరాబాద్‌ మహానగరంగా మారింది. మీరు నగరానికి తీసుకొచ్చింది ఏవైనా ఉంటే గంజాయి, డ్రగ్స్‌ మాత్రమే’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకునేందుకు తాపత్రయపడుతున్న తనకు మద్దతిస్తే మరింత బలపడతానని, చేతనైనంత సాయం చేస్తామని ఎమ్మెల్యేలు వస్తున్నారని అన్నారు. వారికి ఇవ్వడానికి తన దగ్గర ఏమున్నాయని, తన అంగీ, లాగు అమ్మినా ఏమీ రాదని వ్యాఖ్యానించారు.


రాష్ట్రాన్ని దివాలా తీయించారు

పదేళ్లు ఏమీ చేయనివారు ఉన్నదంతా అమ్ముకొని ఊడ్చుకుపోయారని, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని దివాలా తీయించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల కాగితమే బయటకు వస్తోంది. గతంలో సంవత్సరానికి రూ.6500 కోట్ల అప్పు కట్టేది ఉండె. ఇయ్యాల ప్రతి నెలా మొదటి తారీకున రూ.7 వేల కోట్లు వడ్డీయే కడుతున్నం. ఏటా రూ.72 వేల కోట్లు మిత్తి కట్టనీకే అయితుంది. సంసారం అప్పులపాలైంది. ఒక్కటొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నం’’ అని సీఎం తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరం తరహాలో మహేశ్వరంలో మరో మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల్లో విశ్వవిద్యాలయాలు, మెడికల్‌ టూరిజం, పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.


తాను పాదయాత్ర చేసిన సమయంలో రాచకొండ గుట్టల పక్కనున్న తండాల్లోకి వెళ్లానని, ఊటీ కంటే అద్భుతమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని షూటింగ్‌లకు హబ్‌గా మార్చబోతున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టనుందని, ప్రపంచంలోనే అద్భుత పర్యాటక క్షేత్రంగా జిల్లాను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. హయత్‌నగర్‌ వరకు త్వరలో మెట్రో రాబోతోందని, అటు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించేలా మెట్రో రైల్‌ను విస్తరిస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో భూమి బంగారమైందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందని చెప్పారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో అభివృద్ధి మరింతగా పరుగులు పెడుతుందన్నారు.


బలహీనవర్గాలు పాలకులుగా ఎదగాలి

బలహీనవర్గాలు పాలకులుగా మారాలంటే ఏకైక మార్గం చదువేనని సీఎం అన్నారు. ఇందుకోసం వైఎ్‌సఆర్‌ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఈ ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగిస్తోందన్నారు. ‘‘కుల వృత్తులను నమ్ముకొని మీరు కష్టపడుతున్నరు. మీ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలి. చట్టసభల్లో శాసనాలు చేసే స్థాయికి మీ పిల్లలు ఎదగాలి’’ అని రేవంత్‌ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అకాశాలు రాకపోవచ్చని, కుల వృత్తుల బలోపేతానికి చర్యలు తీసుకోవడం ద్వారా కుటుంబాలను నిలబెట్టినట్లవుతుందని చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా కొత్తగా నిర్మించే రోడ్ల పక్కన, చెరువు కట్టలపై, కాలువల వెంట, సాగునీటి ప్రాజెక్టుల వద్ద తాటి చెట్లు, ఈత చెట్లు నాటేలా అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సీఎం సూచించారు. ఇరిగేషన్‌ విభాగంతో ఈ విషయంపై చర్చించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే తాటి, ఈత వనాల కోసం కేటాయించేందుకు అభ్యంతరం లేదన్నారు. మరణించిన, గాయపడిన గీత కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.7.90 కోట్లను వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఎవరెస్ట్‌ ఎక్కిన మాలావత్‌ పూర్ణ బృందం అనుభవం గౌడన్నలకు ఉపయోగపడతుందన్నారు.


వాళ్ల ఉద్యోగాలు ఊడుతాయి

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేయకపోతే వాళ్ల ఉద్యోగం ఊడుతది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనకు బలం. అందరం కలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నం.. పదేళ్లు కష్టపడి కాపాడుకుందాం.. అభివృద్ధి చేసుకుందాం’’ అని రేవంత్‌ అన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాటి, ఈతకు సంబంధించి 80 బైప్రొడక్టుల విషయంపై ఆలోచిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, గడిచిన పదేళ్లలో గీతకార్మికులకు ఎలాంటి సహకారం అందలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అన్నారు. నీరా, తాటికల్లును సహజ ఉత్పత్తులుగా అమ్ముకునేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ ముగుస్తున్న సమయంలో కొందరు మధ్యాహ్న భోజన కార్మికులు లేచి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని ఏమీ అనవద్దని, వారి సమస్యలను ఎమ్మెల్యేకు, ఎంపీకి తెలపాలని సూచించారు. సీఎం సభలో కూర్చున్న సమయంలో వీఐపీ గ్యాలరీ నుంచి ఓ మహిళ లేచి వినతి పత్రం చూపించగా వారి వద్దకు వెళ్లి తీసుకోవాలని తన సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి రేవంత్‌ సూచించారు.


నిరుద్యోగులూ.. మీ బాధలు చెప్పండి!

నిరుద్యోగుల బాధలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘నిన్న, మొన్న మా పిల్లలు కూడా పరీక్షలు వాయిదా వేయండని కోరుతున్నరు. మీ బాధలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలు రోడ్డెక్కే బదులు.. మంత్రులను కలవండి. సాధక బాధకాలుంటే చెప్పండి. తప్పకుండా విని సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది’’ అని చెప్పారు. నిరుద్యోగులతో మాట్లాడి.. వారి ఇబ్బందులు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.


సేఫ్టీ కిట్‌ బాగుందా

లష్కర్‌గూడ గ్రామంలోని వనంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈత చెట్టును నాటిన అనంతరం.. కాటమయ్య రక్షక కవచాలను ధరించిన గీత కార్మికులు చెట్టుపై ప్రమాదం జరిగితే కవచాలు ఎలా కాపాడుతాయో ప్రయోగాత్మకంగా చూపించారు. కొంతమంది కార్మికులు కవచాలు ధరించి చెట్టు ఎక్కి మోకును వదిలేసి వేలాడారు. ఈ సందర్భంగా కార్మికులు తాటిచెట్టుపై ఉండగానే వారితో సీఎం మాట్లాడారు. రక్షక కవచం భాగుందా? అని రంగయ్య అనే గీత కార్మికుడిని ప్రశ్నించారు. అతడు ‘బాగుంది సార్‌’ అని చెప్పగా.. గుతి పోతే తిరిగి ఎలా పెట్టుకుంటారని అడిగారు. వెంటనే కాళ్లతో గుతిని పెట్టుకుని కార్మికులు చూపించారు. మరో కార్మికుడిని ఉద్దేశించి, ‘ఏం గౌడ్‌ సాబ్‌! ఆ ఎల్లో టీషర్టు వేసుకున్నాయన పేరేంటి? నీ టీషర్టు బాగుంది’’ అని రేవంత్‌ అన్నారు. అతడు, ‘కృష్టయ్య సార్‌’ అని చెప్పగా.. ‘రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతారు? ఎన్ని లీటర్ల కల్లు వస్తుంది? బెల్టు షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బ తీస్తున్నాయి కదా! అందుకే వాటిని తీసేశాం. అవి రాకుండా చూసుకోండి’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా తాటివనం కోసం 5 ఎకరాల స్థలం, మోపెడ్‌ వాహనాలు అందించాలని కార్మికులు సీఎంను కోరారు.


ప్రజాభవన్‌లో బోనాల ఉత్సవాలు

  • హాజరైన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు స్వయంగా తీసుకువచ్చి శివసత్తులకు అందించారు.

Updated Date - Jul 15 , 2024 | 03:04 AM