Share News

Railaway Station: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి..

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:07 AM

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్‌ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు.

Railaway Station: చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు 98% పూర్తి..

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

  • ఆరేళ్లుగా కొనసాగుతున్న విస్తరణ పనులు

న్యూఢిల్లీ/కుషాయిగూడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్‌ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు. ఈ మేరకు చర్లపల్లి రైల్వేస్టేషన్‌ చిత్రాలను శనివారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ స్టేషన్‌ అందుబాటులోకి వచ్చాక హైదరాబాద్‌, సికిందరాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతోన్న చర్లపల్లి రైల్వే టర్మినల్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. చర్లపల్లి భరత్‌ నగర్‌ వద్ద నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తి చేసుకొని వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది.


రైల్వే స్టేషన్‌ ప్రధాన ద్వారం నుంచి గోకుల్‌నగర్‌, మల్లాపూర్‌, ఎన్‌ఎ్‌ఫసీ బ్రిడ్జి వరకు వంద అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు భూసేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించాలని భావించినా, సాంకేతికపరమైన కొన్ని పనులు పూర్తికాకపోవడంతో మరి కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, శనివారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 98 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. కానీ, స్టేషన్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేదు. దీంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

Updated Date - Jul 14 , 2024 | 04:07 AM