Lok Sabha Polls: తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్ నేతలపై షా ఫైర్!
ABN , Publish Date - Apr 25 , 2024 | 02:36 PM
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది..
సిద్దిపేట, ఆంధ్రజ్యోతి 25: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది. ఆయా సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం తరలివస్తోంది. మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా సిద్దిపేట సభలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అంతా మోదీనే చేస్తున్నారు!
‘ కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి. అయోధ్యలో రామమందిరం కోసం మోదీ కృషి చేశారు. మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తీసుకువస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో మునిగిపోయాయి. కాంగ్రెస్ నేతలు తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారు’ అని అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రధాని వచ్చేస్తున్నారు..!
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30న ప్రధాని జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆంధోల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం, శేరిలింగంపల్లి పరిధిలోని ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మే-03న వరంగల్ పార్లమెంటు పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అలాగే, నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల కోసం సంయుక్తంగా నిర్వహించే మరో సభకూ హాజరవుతారు. 4న నారాయణపేట, వికారాబాద్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.