Share News

Uttam Kumar Reddy: కుల గణనకు ప్రభుత్వం సిద్ధం..

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:15 AM

కుల గణన కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

Uttam Kumar Reddy: కుల గణనకు ప్రభుత్వం సిద్ధం..

  • కాంగ్రె్‌సతోనే ఇది సాధ్యం

  • సామాజిక న్యాయానికి పెద్ద పీట

  • బీసీ కమిషన్‌కు అన్ని రకాల సహకారం

  • నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): కుల గణన కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఆ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పెద్ద వేస్తుందని, ఓబీసీలకు తమ హయాంలోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. సోమవారం బీసీ కమిషన్‌ కార్యాలయంలో జరిగిన నూతన పాలక మండలి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్‌ పదవులు ఇవ్వడంతోపాటు పథకాలలోనూ పెద్ద పీట వేస్తుందన్నారు. అందుకే పార్టీలో అత్యంత ఉన్నతమైన పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకే కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.


నిజాయితీ, నిబద్ధత కలిగిన నిరంజన్‌కు బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వడం వల్ల దానికి హుందా తనం వచ్చిందన్నారు. కమిషన్‌ చేపట్టబోయే కుల గణన ప్రక్రియకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలనే పట్టుదలతో రాహుల్‌ ఉన్నారని, సోనియా గాంధీ, ఖర్గేలు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఓబీసీలు ఈ విషయాన్ని గుర్తించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.


బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తమపై మోపిన బాధ్యతను, లక్ష్యాన్ని నెరవేరుస్తామన్నారు. అన్ని కుల సంఘాలతో చర్చిస్తామని, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి కమిషన్‌ను కలువవవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత హనుమంతరావు పాల్గొన్నారు. ఛైర్మన్‌ జి.నిరంజన్‌తోపాటు సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాల లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Sep 10 , 2024 | 03:15 AM