Share News

Karimnagar: లోడు ఎరువుకు రూ.లక్ష లంచం..

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:09 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించిన కాం ట్రాక్టర్‌కు చెల్లించాల్సిన డబ్బుకు బదులు ఎరువుల లోడ్‌లు ఇస్తూ ఒక్కో లోడుకు రూ.లక్ష చొప్పున లంచం డిమాండ్‌ చేస్తున్న కరీంనగర్‌ డీసీఎంఎస్‌ మేనేజర్‌ రేగులపాటి వెంకటేశ్వర్‌రావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు.

Karimnagar: లోడు ఎరువుకు రూ.లక్ష లంచం..

  • ఏసీబీకి చిక్కిన కరీంనగర్‌ డీసీఎంఎస్‌ మేనేజర్‌, క్యాషియర్‌

కరీంనగర్‌ క్రైం, జూలై 4 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించిన కాం ట్రాక్టర్‌కు చెల్లించాల్సిన డబ్బుకు బదులు ఎరువుల లోడ్‌లు ఇస్తూ ఒక్కో లోడుకు రూ.లక్ష చొప్పున లంచం డిమాండ్‌ చేస్తున్న కరీంనగర్‌ డీసీఎంఎస్‌ మేనేజర్‌ రేగులపాటి వెంకటేశ్వర్‌రావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) ఆధ్వర్యంలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు అనే కాంట్రాక్టర్‌ మౌలిక వసతులు కల్పించారు. ఇందుకు సంబంధించి 2018-23 వరకు రాజుకు రూ.90,16,652 కమీషన్‌ చెల్లించాల్సి ఉంది. ఈ కమీషన్‌ ఇవ్వాలంటే తనకు లంచం ఇవ్వాలని డీసీఎంఎస్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు రాజును వేధిస్తున్నారు.


అయితే, రాజుకు చెల్లించాల్సిన డబ్బు కింద ఇటీవల రూ.20,91,500 విలువైన ఎరువులు ఇచ్చిన మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు 4 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. మిగిలిన రూ. 69,25,152 కోసం రాజు అడగ్గా 4 లక్షలు లంచం ఇవ్వాలని, మిగిలిన డబ్బుకు బదులుగా 15 లారీల ఎరువులు ఇస్తానని చెప్పాడు. ఒక్కో లారీ తీసుకెళ్లేముందు లోడుకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని స్పష్టం చేశాడు. దీంతో విసిగిపోయినన రాజు జూలై1న ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు డీసీఎంఎస్‌ మేనేజర్‌ను కలిసిన రాజు రూ.లక్ష ఇవ్వబోగా నగదును క్యాషియర్‌ కుమారస్వామికి ఇవ్వాలని మేనేజర్‌ సూచించారు. రాజు నుంచి కుమారస్వామి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 05:09 AM